Garlic Pickle : వెల్లుల్లితో నిల్వ ప‌చ్చ‌డి.. ఎంతో రుచిగా ఉంటుంది.. ఇలా సుల‌భంగా పెట్ట‌వ‌చ్చు..

Garlic Pickle : మ‌నం ఆవ‌కాయ‌, ట‌మాట‌, పండుమిర్చి వంటి ర‌క‌ర‌కాల నిల్వ ప‌చ్చ‌ళ్ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. ఈ ప‌చ్చ‌ళ్ల‌ను ఆయా కాయ‌లు ల‌భించే కాలంలో మాత్ర‌మే త‌యారు చేస్తాం. కానీ సంవ‌త్స‌రం పొడ‌వునా త‌యారు చేసుకోవ‌డానికి వీలుగా ఉండే నిల్వ ప‌చ్చళ్లల్లో వెల్లుల్లి ప‌చ్చ‌డి కూడా ఒక‌టి. వెల్లుల్లిలో అనేక ర‌కాల ఔష‌ధ గుణాలు ఉన్నాయి. దీనిని ఔష‌ధంగా ఉప‌యోగించి మ‌నం వివిధ ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. మ‌న‌కు ఎంతో మేలు చేసే ఈ వెల్లుల్లితో నిల్వ ప‌చ్చ‌డిని ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాల‌ను ప‌క్కా కొల‌త‌ల‌తో స‌హా తెలుసుకుందాం.

వెల్లుల్లి నిల్వ ప‌చ్చ‌డి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

వెల్లుల్లి రెబ్బ‌లు – అర క‌ప్పు, నూనె – 150 గ్రా., ఇంగువ – అర టీ స్పూన్, చిక్క‌టి చింత‌పండు గుజ్జు – 75 గ్రా., ప‌సుపు – అర టీ స్పూన్, కారం – 50 గ్రా., ఉప్పు – 3 టేబుల్ స్పూన్స్, ఆవ పిండి – 2 టీ స్పూన్స్, మెంతి పిండి – ఒక టీ స్పూన్.

Garlic Pickle make in this method lasts longer
Garlic Pickle

వెల్లుల్లి నిల్వ ప‌చ్చ‌డి త‌యారీ విధానం..

ఈ పచ్చ‌డిని త‌యారు చేసుకోవ‌డానికి గాను ముందుగా ఒక క‌ళాయిలో నూనెను పోసి వేడి చేయాలి. నూనె కొద్దిగా వేడ‌య్యాక ఇంగువ‌ను వేసి క‌ల‌పాలి. త‌రువాత పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బ‌ల‌ను వేసి వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన త‌రువాత చింత‌పండు గుజ్జును వేసి క‌ల‌పాలి. చింత‌పండు గుజ్జులోని నీరు అంతా పోయి ద‌గ్గ‌ర ప‌డే వ‌ర‌కు కలుపుతూ ఉడికించాలి. ఇందులోనే ప‌సుపును కూడా వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేయాలి. ఇలా త‌యారు చేసుకున్న వెల్లుల్లి మిశ్ర‌మాన్ని పూర్తిగా చ‌ల్లారే వ‌ర‌కు ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత ఇందులో కారం, ఉప్పు, ఆవాల పిండి, మెంతి పిండి వేసి అన్నీ క‌లిసేలా బాగా క‌ల‌పాలి.

ఇలా త‌యారు చేసుకున్న ప‌చ్చ‌డిని ఒక గిన్నెలోకి తీసుకుని మూత పెట్టి ఒక రోజంతా అలాగే ఉంచాలి. త‌రువాత ఈ ప‌చ్చ‌డిని ఒక గాజు సీసాలో లేదా జాడీలో ఉంచి నిల్వ చేసుకోవాలి. ఈ విధంగా త‌యారు చేసుకున్న వెల్లుల్లి ప‌చ్చ‌డి నాలుగు నెల‌ల పాటు తాజాగా ఉంటుంది. ఇలా త‌యారు చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే వెల్లుల్లి నిల్వ ప‌చ్చ‌డి త‌యార‌వుతుంది. వేడి వేడి అన్నంలో నెయ్యితో క‌లిపి ఈ ప‌చ్చ‌డిని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇంట్లో ప‌చ్చ‌ళ్లు ఏవీ లేన‌ప్పుడు ఇలా వెల్లుల్లితో ప‌చ్చ‌డిని త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఈ ప‌చ్చ‌డిని తిన‌డం వ‌ల్ల ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది.

D

Recent Posts