Gobi Fried Rice : కాలిఫ్ల‌వ‌ర్‌తో ఇలా ఫ్రైడ్ రైస్ చేయండి.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Gobi Fried Rice : మ‌న‌కు బ‌య‌ట రెస్టారెంట్ ల‌లో, ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్లలో ల‌భించే వంట‌కాల్లో గోబీ రైస్ కూడా ఒక‌టి. గోబీ రైస్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని మ‌న‌లో చాలా మంది రుచి చూసే ఉంటారు. అచ్చం బ‌య‌ట ల‌భించే విధంగా ఉండే ఈ గోబీ రైస్ ను మ‌నం ఇంట్లోనే త‌యారు చేసుకోవ‌చ్చు. గోబీ రైస్ ను ఇంట్లో ఏవిధంగా త‌యారు చేసుకోవాలి.. దీని త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

గోబీ ఫ్రైడ్ రైస్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

కాలీఫ్ల‌వ‌ర్ ముక్క‌లు – 2 క‌ప్పులు, నాన‌బెట్టిన బాస్మ‌తి బియ్యం – 100 గ్రాములు, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక‌టిన్న‌ర టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, కారం – ఒక టీ స్పూన్, మిరియాల పొడి – ఒక టీ స్పూన్, కార్న్ ఫ్లోర్ – 2 టేబుల్ స్పూన్స్, మైదా పిండి – 2 టేబుల్ స్పూన్స్, ఫుడ్ క‌ల‌ర్ – చిటికెడు, నూనె – డీప్ ఫ్రై కి స‌రిప‌డా, చిన్న‌గా త‌రిగిన వెల్లుల్లి రెబ్బ‌లు – ఒక టేబుల్ స్పూన్, చిన్న‌గా త‌రిగిన ప‌చ్చిమిర్చి – 1, చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ ముక్క‌లు – అర క‌ప్పు, ప‌చ్చి బ‌ఠాణీ – 2 టేబుల్ స్పూన్స్, చిన్న‌గా త‌రిగిన ఫ్రెంచ్ బీన్స్ – 2 టేబుల్ స్పూన్స్, క్యాబేజ్ తురుము – అర క‌ప్పు, వెనిగ‌ర్ – ఒక టీ స్పూన్, గ్రీన్ చిల్లీ సాస్ – ఒక టీ స్పూన్, సోయా సాస్ – ఒక టీ స్పూన్, త‌రిగిన స్ప్రింగ్ ఆనియ‌న్స్ – కొద్దిగా.

Gobi Fried Rice here it is how to make it
Gobi Fried Rice

గోబీ ఫ్రైడ్ రైస్ త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో నీటిని తీసుకుని వేడి చేయాలి. ఇందులోనే ఒక టీ స్పూన్ నూనె, ఉప్పు వేయాలి. నూనె వేడ‌య్యాక నాన‌బెట్టుకున్న బాస్మ‌తి బియ్యం వేసి మెత్త‌గా అయ్యే వ‌ర‌కు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న త‌రువాత నీళ్లు అన్నీ పోయేలా వ‌డ‌క‌ట్టుకోవాలి. త‌రువాత అన్నాన్ని ఒక ప్లేట్ లోకి తీసుకుని ఆర‌బెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో క్యాబేజ్ ముక్క‌ల‌ను తీసుకోవాలి. త‌రువాత అందులో ఉప్పు, కారం, మిరియాల పొడి, కార్న్ ఫ్లోర్, మైదా పిండి, ఫుడ్ క‌ల‌ర్ వేసి క‌లుపుకోవాలి. త‌రువాత త‌గిన‌న్ని నీళ్లు పోస్తూ ముక్క‌ల‌కు ప‌ట్టేలా బాగా క‌లుపుకోవాలి.

త‌రువాత క‌ళాయిలో నూనె పోసి నూనె కాగిన త‌రువాత కాలిఫ్ల‌వ‌ర్ ముక్క‌ల‌ను వేసి వేయించుకోవాలి. వీటిని క‌ర‌క‌ర‌లాడే వ‌ర‌కు మ‌ధ్య‌స్థ మంట‌పై వేయించుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు మ‌రో క‌ళాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక వెల్లుల్లి రెబ్బ‌లు, ప‌చ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించుకోవాలి. త‌రువాత ప‌చ్చి బ‌ఠాణీ, ఫ్రెంచ్ బీన్స్, క్యాబేజ్ తురుము వేసి వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన త‌రువాత అర టీ స్పూన్ మిరియాల పొడి, ఉప్పు, వెనిగ‌ర్, చిల్లీ సాస్, సోయా సాస్ వేసి క‌లుపుతూ ఒక నిమిషం పాటు వేయించుకోవాలి.

త‌రువాత ముందుగా వేయించిన కాలిఫ్ల‌వ‌ర్ ముక్క‌ల‌ను వేసి క‌లుపుతూ మ‌రో రెండు నిమిషాల పాటు వేయించాలి. త‌రువాత ఉడికించిన బాస్మ‌తి బియ్యాన్ని వేసి అంతా క‌లిసేలా క‌లుపుకోవాలి. దీనిని మ‌రో మూడు నిమిషాల పాటు వేయించాలి. చివ‌ర‌గా స్ప్రింగ్ ఆనియ‌న్స్ ను చ‌ల్లి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే గోబీ ఫ్రైడ్ రైస్‌ త‌యార‌వుతుంది. దీనిని వేడిగా ఉన్న‌ప్పుడే ఉల్లిపాయ ముక్క‌లు, నిమ్మ‌ర‌సంతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. కాలిఫ్ల‌వ‌ర్ తో త‌ర‌చూ చేసే వంట‌ల‌కు బ‌దులుగా ఇలా అప్పుడ‌ప్పుడూ గోబీ రైస్ ను కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు.

D

Recent Posts