Godhuma Attu : గోధుమ పిండితో అట్టు వేసి ఎప్పుడైనా తిన్నారా.. ఒక్క‌సారి తిని చూడండి.. రుచిని మ‌రిచిపోరు..!

Godhuma Attu : మ‌నం గోధుమ‌పిండితో చ‌పాతీ, రోటీ, పుల్కా వంటి త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. గోధుమ పిండితో చేసే వంట‌కాల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. ఇవే కాకుండా గోధుమ‌పిండితో మ‌నం ఎంతో రుచిగా ఉండే అట్టును కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఉద‌యం స‌మ‌యం త‌క్కువ‌గా ఉన్న‌ప్పుడు ఇలా అట్టును త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. గోధుమ పిండి అట్టును త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. రుచిగా, సుల‌భంగా గోధుమ‌పిండితో అట్టును ఎలా త‌యారు చేసుకోవాలి…అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

గోధుమ అట్టు త‌యారీకి కావల్సిన ప‌దార్థాలు..

గోధుమ పిండి – 2 కప్పులు, పెరుగు – ఒక క‌ప్పు, బియ్యం పిండి – ఒక‌ కప్పు, ఉప్పు – త‌గినంత‌, గోరు వెచ్చ‌ని నీళ్లు – ఒక క‌ప్పు, చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ – 1, చిన్న‌గా తరిగిన ప‌చ్చిమిర్చి – 4, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్.

Godhuma Attu recipe in telugu make in this method
Godhuma Attu

గోధుమ అట్టు త‌యారీ విధానం..

ముందుగా గిన్నెలో గోధుమ పిండిని తీసుకోవాలి. త‌రువాత ఇందులో పెరుగు, బియ్యం పిండి, ఉప్పు, ఉల్లిపాయ ముక్క‌లు, ప‌చ్చిమిర్చి, జీల‌క‌ర్ర వేసి క‌ల‌పాలి. త‌రువాత నీళ్లు పోసుకుని పిండిని అట్టు పిండిలా క‌లుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని అర గంట పాటు నాన‌బెట్టాలి. అరగంట త‌రువాత అవ‌స‌ర‌మైతే మ‌రికొన్ని నీళ్లు పోసుకుని క‌ల‌పాలి. ఇప్పుడు స్ట‌వ్ మీద పెనాన్ని ఉంచి వేడి చేయాలి. పెనం వేడ‌య్యాక పిండిని తీసుకుని అట్టులా పోసుకోవాలి. దీని అంచుల చుట్టూ నూనె వేసుకుంటూ రెండు వైపులా ఎర్ర‌గా కాల్చుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే గోధుమ అట్టు త‌యార‌వుతుంది. వీటిని కొబ్బరి చ‌ట్నీతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. త‌ర‌చూ చేసే అల్పాహారాలతో పాటు అప్పుడ‌ప్పుడూ ఇలా గోధుమ పిండితో కూడా అట్టును త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts