Gongura Pappu : మనం ఆకుకూరలతో వివిధ రకాల పప్పు కూరలను కూడా తయారుచేస్తూ ఉంటాము. వాటిలో గోంగూర పప్పు కూడా ఒకటి. గోంగూర పప్పు చాలా రుచిగా ఉంటుంది. ఈ పప్పును ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. చాలా మంది గోంగూరపప్పును ఇష్టంగా తింటారని చెప్పవచ్చు. ఈ పప్పును ఒక్కొక్కరు ఒక్కో రుచితో తయారు చేస్తూ ఉంటారు. కింద చెప్పిన విధంగా చేసే గోంగూర పప్పు కూడా చాలా రుచిగా ఉంటుంది. మొదటిసారి చేసే వారు, బ్యాచిలర్స్ కూడా ఈ పప్పును సులభంగా తయారు చేసుకోవచ్చు. గోంగూర పప్పును మరింత రుచిగా చాలా సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
గోంగూర పప్పు తయారీకి కావల్సిన పదార్థాలు..
కందిపప్పు – ఒక కప్పు, తరిగిన గోంగూర – 4 కప్పులు, తరిగిన పచ్చిమిర్చి – 10లేదా కారానికి తగినన్ని, తరిగిన టమాట – పెద్దది ఒకటి, చింతపండు – ఒక రెమ్మ, పసుపు – చిటికెడు, ఉప్పు – తగినంత.
తాళింపుకు కావల్సిన పదార్థాలు..
నూనె – 3 టేబుల్ స్పూన్స్, ఆవాలు -ఒక టీ స్పూన్,జీలకర్ర – అర టీ స్పూన్, ఎండుమిర్చి – 2, దంచిన వెల్లుల్లి రెబ్బలు – 4, సన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, కరివేపాకు – ఒక రెమ్మ, ఇంగువ – పావు టీ స్పూన్.
గోంగూర పప్పు తయారీ విధానం..
ముందుగా కుక్కర్ లో పప్పును వేసి శుభ్రంగా కడగాలి. తరువాత గోంగూరతో పాటు మిగిలిన పదార్థాలన్నీ వేసి తగినన్ని నీళ్లు పోసి మూత పెట్టాలి. ఇప్పుడు ఈ పప్పును 7 నుండి 8 విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడికించాలి. ఆవిరి పోయిన తరువాత మూత తీసి పప్పును మెత్తగా చేసుకోవాలి. తరువాత మరికొద్దిగా నీటిని పోసి కలిపి పక్కకు ఉంచాలి. ఇప్పుడు తాళింపుకు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు పదార్థాలను ఒక్కొక్కటిగా వేసి వేయించాలి. తాళింపు చక్కగా వేగిన తరువాత ముందుగా సిద్దం చేసుకున్న పప్పును వేసి కలపాలి. ఈ పప్పును మరో 5 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే గోంగూర పప్పు తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, రోటీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన పప్పును అందరూ లొట్టలేసుకుంటూ ఎంతో ఇష్టంగా తింటారు.