Gongura Pappu : మనం ఆహారంలో భాగంగా తీసుకునే ఆకుకూరల్లో గోంగూర కూడా ఒకటి. గోంగూర పుల్లని రుచిని కలిగి ఉంటుంది. దీనిని కూడా మనం ఎంతో కాలం నుండి ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉన్నాం. గోంగూరతో మనం ఎక్కువగా పచ్చడిని, పప్పును తయారు చేసుకుని తింటూ ఉంటాం. గోంగూరతో చేసే పప్పు చాలా రుచిగా ఉంటుంది. పప్పే కదా అని చాలా మంది తేలికగా తీసుకుంటూ ఉంటారు. సరిగ్గా చేయాలే కానీ గోంగూర పప్పు ఎంతో రుచిగా ఉంటుంది. మరింత రుచిగా గోంగూర పప్పును ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
గోంగూర పప్పు తయారీకి కావల్సిన పదార్థాలు..
గోంగూర – 4 కప్పులు, కందిపప్పు – ఒక కప్పు, తరిగిన పచ్చి మిర్చి – 8 లేదా తగినన్ని, తరిగిన టమాట – 1 (పెద్దది), చింతపండు – కొద్దిగా, ఉప్పు – తగినంత, నీళ్లు – తగినన్ని, పసుపు – అర టీ స్పూన్.
తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 3 టేబుల్ స్పూన్స్, ఆవాలు – ఒక టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, ఎండు మిర్చి – 2, కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు – 3, సన్నగా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ – 1, కరివేపాకు – ఒక రెబ్బ, ఇంగువ – పావు టీ స్పూన్.
గోంగూర పప్పు తయారీ విధానం..
గోంగూర పప్పును తయారు చేసుకోవడానికి గాను ముందుగా గోంగూరను శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత ఒక కుక్కర్ లో పప్పును, కట్ చేసుకున్న గోంగూరతోపాటు ఉప్పు, పచ్చిమిర్చి, టమాట, పసుపు, చింతపండుతోపాటు తగినన్ని నీళ్లను కూడా పోసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ పై మూతను ఉంచి 6 నుండి 8 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తరువాత మూత తీసి పప్పును గంటెతో మెత్తగా చేసుకోవాలి. తరువాత పలుచగా కావాలనుకునే వారు తగినన్ని నీళ్లను పోసి పలుచగా కూడా చేసుకోవచ్చు.
ఇప్పుడు కళాయిలో నూనె వేసి నూనెను వేడిచేయాలి. నూనె వేడయ్యాక తాళింపు పదార్థాలను ఒక్కొక్కటిగా వేసి తాళింపు చేసుకోవాలి. తాళింపు వేగిన తరువాత ఇందులో ముందుగా ఉడికించుకున్న పప్పును వేసి కలుపుకోవాలి. ఈ పప్పును మరో 5 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే గోంగూర పప్పు తయారవుతుంది. ఈ పప్పును వేడి వేడి అన్నంలో నెయ్యితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.