Gongura Tomato Roti Pachadi : మనం టమాటాలతో రకరకాల రోటి పచ్చళ్లను తయారు చేస్తూ ఉంటాము. టమాటాలతో చేసే రోటి పచ్చళ్లు చాలా రుచిగా ఉంటాయి. టమాటాలతో చేసుకోదగిన పచ్చళ్లల్లో గోంగూర టమాట రోటి పచ్చడి కూడా ఒకటి. ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. అన్నంతో తినడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. అలాగే ఈ పచ్చడిని తయారు చేసుకోవడం కూడా చాలా సులభం. వంటరాని వారు కూడా ఈ పచ్చడిని సులభంగా తయారు చేసుకోవచ్చు. చూస్తేనే నోట్లో నీళ్లు ఊరేలా ఉండే ఈ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
గోంగూర టమాట రోటి పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 20, మినపప్పు – ఒక టేబుల్ స్పూన్, మెంతులు – పావు టీ స్పూన్, ధనియాలు – ఒక టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, తరిగిన టమాటాలు – 2, గోంగూర – 2 కట్టలు( మధ్యస్థంగా ఉన్నవి), చింతపండు – ఒక రెమ్మ, పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత.
గోంగూర టమాట రోటి పచ్చడి తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఎండుమిర్చి వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత మెంతులు, మినపప్పు వేసి వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన తరువాత ధనియాలు, జీలకర్ర వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత మరికొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక టమాట ముక్కలు, గోంగూర, చింతపండు వేసి మెత్తగా అయ్యే వరకు మగ్గించాలి. టమాట ముక్కలు మెత్తగా మగ్గిన తరువాత పసుపు వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వాలి. ఇప్పుడు రోలును తీసుకుని అందులో ఎండుమిర్చి, వేయించిన దినుసులు వేసి మెత్తగా దంచుకోవాలి. తరువాత ఉడికించిన గోంగూర, టమాటాలు వేసి దంచుకోవాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి కచ్చా పచ్చగా దంచుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఈ పచ్చడిలో తాళింపు దినుసులు, వెల్లుల్లి రెమ్మలు, ఎండుమిర్చి, కరివేపాకుతో తాళింపు చేసి వేసి కలిపి సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే గోంగూర టమాట రోటి పచ్చడి తయారవుతుంది. దీనిని వేడి వేడి అన్నం , నెయ్యితో తింటే చాలా రుచిగా ఉంటుంది.