Green Mango Mint Chutney : పచ్చి మామిడికాయలతో ఇలా ఒక్కసారి పచ్చడి చేయండి.. అన్నం, టిఫిన్‌.. వేటిలోకి అయినా బాగుంటుంది..!

Green Mango Mint Chutney : పచ్చి మామిడికాయలు అనగానే సహజంగానే ఎవరికైనా సరే నోట్లో నీళ్లూరతాయి. వాటిని కట్‌ చేసి ముక్కలపై ఉప్పు, కారం చల్లి తింటే వచ్చే మజాయే వేరు. ఇక పచ్చి మామిడికాయలు పుల్లగా ఉంటే వాటితో పచ్చడి, పప్పు, ఇతర కూరలు వంటివి చేస్తుంటారు. అయితే పచ్చి మామిడికాయలతో ఎంతో టేస్టీగా ఉండే పుదీనా పచ్చడిని కూడా చేయవచ్చు. పుదీనా, పచ్చి మామిడికాయలు కలిపి చేసే ఈ పచ్చడి ఎంతో టేస్టీగా ఉంటుంది. అందరూ ఇష్టంగా తింటారు. ఈ క్రమంలోనే ఈ పచ్చడిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

పచ్చి మామిడికాయ పుదీనా పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..

పచ్చి మామిడికాయ చిన్నది – 1, కొత్తిమీర తురుము – 3 కప్పులు, పుదీనా తురుము – ఒక కప్పు, పచ్చి మిర్చి – ఆరు, అల్లం తురుము – ఒక టీస్పూన్‌, వెల్లుల్లి రెబ్బలు – ఆరు, ఉప్పు – రుచికి సరిపడా, ఇంగువ – కొద్దిగా, జీలకర్ర – రెండు టీస్పూన్లు.

Green Mango Mint Chutney recipe in telugu make in this method
Green Mango Mint Chutney

పచ్చి మామిడికాయ పుదీనా పచ్చడిని తయారు చేసే విధానం..

మామిడికాయను చిన్న ముక్కలుగా కట్‌ చేయాలి. కొత్తిమీర, పుదీనా శుభ్రంగా కడిగి తరగాలి. ఇప్పుడు చిన్న పాన్‌లో వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి వేయించాలి. మిక్సీ జార్‌లో మామిడికాయ ముక్కలు, కొత్తిమీర, పుదీనా, సగం జీలకర్ర, అల్లం, వేయించిన పచ్చి మిర్చి, వెల్లుల్లి సరిపడా వేసి మెత్తగా రుబ్బాలి. ఇప్పుడు పాన్‌లో నూనె వేసి ఆవాలు, ఉప్పు, జీలకర్ర, ఇంగువ వేసి వేగాక కరివేపాకు వేసి వేయించి ఈ తాళింపును పచ్చడిలో కలపాలి. దీంతో ఎంతో రుచిగా ఉండే మామిడికాయ పుదీనా పచ్చడి రెడీ అవుతుంది. దీన్ని అన్నం లేదా ఏదైనా టిఫిన్‌లో కలిపి తింటే రుచి అదిరిపోతుంది.

Editor

Recent Posts