ఆకుకూర‌లను ఇలా పెంచండి.. బాగా వ‌స్తాయి..!

ఆకుకూర‌లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. ఆకుకూర‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీర బ‌రువు అదుపులో ఉంటుంది. జీర్ణ‌శ‌క్తి మెరుగుప‌డుతుంది. రక్త‌హీన‌త త‌గ్గుతుంది. గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. ఇలా అనేక ర‌కాలుగా ఆకుకూర‌లు మ‌న ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఆకుకూర‌ల‌తో మ‌నం ఎక్కువ‌గా వివిధ ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. వీటిని ఎక్కువ‌గా మ‌నం మార్కెట్ లో కొనుగోలు చేస్తూ ఉంటాము. అయితే నేటి త‌రుణంలో ఈ ఆకుకూర‌ల‌ను కూడా మందులు, ఎరువులు, పురుగు మందులు, ర‌సాయ‌నాలు వాడి ఏపుగా పెరిగేలా చేస్తున్నారు. ఇలా పెంచిన ఆకుకూర‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం ఆరోగ్యానికి బ‌దులుగా అనారోగ్యానికి గురి అవుతున్నాము.

క‌నుక వీలైనంత వ‌ర‌కు మ‌నం ఇంట్లోనే ఆకుకూర‌ల‌ను పెంచుకోవ‌డం మంచిది. ఇంట్లో ఆకుకూర‌ల‌ను చాలా సుల‌భంగా పెంచుకోవ‌చ్చు. వీటిని పెంచుకోవ‌డానికి ఎక్కువ‌గా స్థ‌లం కూడా అవ‌స‌ర‌మ‌వ్వ‌దు. కుండీలు పెట్టుకునే స్థలం ఉంటే చాలు. మ‌న ఇంట్లోనే ఆకుకూర‌ల‌ను సుల‌భంగా ఎలా పెంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. దీని కోసం ఒక ట‌బ్ ను తీసుకుని దానికి రంధ్రాలు చేయాలి. త‌రువాత ఈ రంధ్రాల పై మ‌ట్టి బ‌య‌ట‌కు పోకుండా చిన్న చిన్న బండ‌ల‌ను ఉంచాలి.

grow vegetables and leaves at home in this method

త‌రువాత ఇందులో 30 శాతం మ‌ట్టి, 30 శాతం వ‌ర్మీ కంపోస్ట్, 30 శాతం ఇసుక‌, 10 శాతం కోకో పీట్ వేసి క‌ల‌పాలి.త‌రువాత ఇందులో పురుగులు రాకుండా కొద్దిగా వేప పిండిని వేసుకోవాలి. త‌రువాత దీనిని అంతా త‌డిసేలా నీటితో త‌డ‌పాలి. ఇప్పుడు పైన కొద్దిగా మ‌ట్టిని తీసి విత్త‌నాలను చ‌ల్లుకోవాలి. ఈ విత్త‌నాల‌పై మ‌ర‌లా మ‌ట్టిని ప‌లుచ‌గా చ‌ల్లుకోవాలి. లేదంటే ట‌బ్ లో నిలువుగా ఒక ఇంచు పొడ‌వుతో మ‌ట్టిని త‌వ్వి అందులో విత్తనాల‌ను వేసి పైన మ‌ట్టితో క‌ప్పాలి. త‌రువాత నీటిని చ‌ల్లుకోవాలి. ఈ ట‌బ్ ను పూర్తిగా ఎండ‌లో లేదా కొద్దిగా ఎండ త‌గిలేలా ఉంచుకోవాలి. అదే వ‌ర్షం ప‌డేట‌ప్పుడు మాత్రం వ‌ర్షంలో ఉంచకూడ‌దు. ఇలా ఎండ త‌గిలేలా ఉంచ‌డంతో పాటు రోజూ నీటిని చ‌ల్లుతూ ఉండాలి.

ఇలాచేయ‌డం వ‌ల్ల మొక్క‌లు చ‌క్క‌గా రావ‌డంతో పాటు ఏపుగా పెరుగుతాయి. చాలా మంది ఆకుకూర‌ల‌ను పెంచుకున్న‌ప్ప‌టికి అవి కొద్దిగా వ‌చ్చి పెర‌గ‌డం ఆగిపోవ‌డం జ‌రుగుతుంది. అలాగే కొంద‌రికి మొక్క‌ల్లో ఎదుగుద‌ల‌నేది కూడా ఉండ‌దు. అలాంటి వారు ఇలా మ‌ట్టిని క‌లిపి విత్త‌నాలు వేసుకోవ‌డం వ‌ల్ల చ‌క్క‌గా ఆకుకూర‌ల‌ను ఇంట్లోనే పెంచుకోవ‌చ్చు. ఈ విధంగా ఆకుకూర‌ల‌ను ఇంట్లోనే పెంచుకుని వండుకోవ‌డం వ‌ల్ల మ‌నం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు.

Share
D

Recent Posts