Guddu Masala Kura : మనం ఉడికించిన కోడిగుడ్లను నేరుగా తినడంతో పాటు వీటితో రకరకాల వంటకాలను తయారు చేసి తీసుకుంటూ ఉంటాము. ఇలా ఉడికించిన కోడిగుడ్లతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో ఎగ్ మసాలా కూర కూడా ఒకటి. ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. ఉడికించిన కోడిగుడ్లతో తరుచూ పులుసు కూరనే కాకుండా ఇలా మసాలా కూరను కూడా తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. కోడిగుడ్లతో రుచిగా మసాలా కూరను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
గుడ్డు మసాలా కూర తయారీకి కావల్సిన పదార్థాలు..
ఉడికించిన కోడిగుడ్లు – 6, దాల్చిన చెక్క – చిన్న ముక్క, తరిగిన పచ్చిమిర్చి – 2, లవంగాలు – 2, మిరియాలు – 10, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, చిన్నగా తరిగిన ఉల్లిపాయలు – 3 ( మధ్యస్థంగా ఉన్నవి), జీలకర్ర – అర టీ స్పూన్, తరిగిన టమాటాలు – 2, ఉప్పు – తగినంత, పసుపు – పావు టీ స్పూన్, కారం – 2 టీ స్పూన్స్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, నీళ్లు – ఒక గ్లాస్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
గుడ్డు మసాలా కూర తయారీ విధానం..
ముందుగా కళాయిలో టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. తరువాత పావు టీ స్పూన్ చొప్పున పసుపు, కారం, ఉప్పు వేసి కలపాలి. తరువాత ఉడికించిన కోడిగుడ్లకు గాట్లు పెట్టి వేసుకోవాలి. ఈ గుడ్లను ఎర్రగా అయ్యే వరకు వేయించాలి. ఇందులోనే ఒక రెమ్మకరివేపాకు వేసి వేయించాలి. గుడ్లు వేగిన తరువాత వీటిని ప్లేట్ లోకి తీసుకుని పక్కకు ఉంచాలి. ఇప్పుడు అదే కళాయిలో మరో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. తరువాత దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు వేసి వేయించాలి. తరువాత పచ్చిమిర్చి వేసి వేయించాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి.
వీటిని కొద్దిగా రంగు మారే వరకు వేయించిన తరువాత జీలకర్ర వేసి వేయించాలి. తరువాత టమాట ముక్కలు వేసి కలపాలి. టమాట ముక్కలు మెత్తగా ఉడికిన తరువాత కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి వేసి కలపాలి. వీటిని ఒక నిమిషం పాటు వేయించిన తరువాత నీళ్లు పోసి కలపాలి. తరువాత వేయించిన కోడిగుడ్లు వేసి కలపాలి. తరువాత వీటిపై మూత పెట్టి మరో 4 నుండి 5 నిమిషాల పాటు ఉడికించి కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే గుడ్డు మసాలా కూర తయారవుతుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.