Gutti Vankaya Biryani : వంకాయలతో చాలా మంది తరచూ వంటలను చేస్తుంటారు. వంకాయల్లో పలు వెరైటీలు మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ క్రమంలోనే వంకాయలతో కూర, వేపుడు, పచ్చడి, పప్పు చేస్తారు. ఇవన్నీ ఎంతో టేస్టీగా ఉంటాయి. అయితే గుత్తి వంకాయలతో చేసే కూర చాలా రుచిగా ఉంటుంది. ఇందులో మసాలా దట్టించి చేస్తే నోట్లో నీళ్లూరతాయి. అయితే గుత్తి వంకాయలతో ఎంతో రుచికరమైన బిర్యానీని కూడా చేసుకోవచ్చు. దీన్ని చేయడం కూడా సులభమే. గుత్తి వంకాయలతో ఎంతో రుచికరమైన బిర్యానీని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
గుత్తి వంకాయ బిర్యానీని తయారు చేసే విధానం..
మసాలా కోసం అల్లం, వెల్లుల్లి, దాల్చిన చెక్క, యాలక్కాయలు, అనాస పువ్వు, లవంగాలు, ధనియాలు, బిర్యానీ ఆకు, మిరియాలను గ్రైండ్ చేసుకోవాలి. రెండు గ్లాసుల బాస్మతి బియ్యం కడిగి పక్కన ఉంచుకుని, ఒక గిన్నెలో నాలుగు గ్లాసుల నీళ్లు పోసి అందులో ఆరు లవంగాలు, నాలుగు యాలక్కాయాలు, రెండు బిర్యానీ ఆకులు, అల్లం వెల్లుల్లి ముద్ద, దాల్చిన చెక్క, షా జీరా, కొద్దిగా ఉప్పు, కొద్దిగా నెయ్యి లేదా నూనె వేయాలి.
బాగా కాగాక బాస్మతి బియ్యం వేసి 3/4 వంతు ఉడికాక చిల్లుల గిన్నెలోకి వంచాలి. బిర్యానీ వండే గిన్నె కింద మట్టు వంపు లేని సమంగా ఉండేది బాగుంటుంది. మట్టు కింద పలుచగా వుంటే కింద పెనం పెట్టు కోవచ్చు. కోసిన వంకాయలలో కొంచెం కొంచెం మసాలా పెట్టి మూకుడులో నూనె పోసి కాగాక వంకాయలు వేసి నెమ్మదిగా కొద్దిగా వేపాలి. బిర్యానీ వండాల్సిన గిన్నెలో కొద్దిగా నెయ్యి వేసి కొన్ని వేగిన వంకాయలు, మసాలా, పుదీనా, కొత్తిమీర, కొద్దిగా వేపిన ఉల్లి పాయ ముక్కలు వేసి ఉడికిన అన్నం కొద్దిగా పరచాలి. తరువాత మిగిలిన వంకాయలు, మసాలా వేసి పుదీనా, కొత్తిమీర, ఉల్లి ముక్కలు వేయాలి. కొద్దిగా నెయ్యిని పైన అంతా వేయాలి. సరిపోయే మూతని పెట్టి బరువుగా ఉండే కల్వం పెడితే గోధుమ పిండితో మూత మూయనవసరం ఉండదు. గ్యాస్ సిమ్ లో 20 నిమిషాలు ఉంచితే గుత్తి వంకాయ బిర్యాని రెడీ అవుతుంది. దీన్ని నేరుగా అలాగే తినవచ్చు. లేదా రైతాతో, కూరతోనూ తినవచ్చు. ఎంతో టేస్టీగా ఉంటుంది. అందరూ ఇష్టంగా తింటారు.