Halwa Puri : హ‌ల్వా పూరీని ఇలా చేయండి.. లొట్ట‌లేసుకుంటూ తింటారు..!

Halwa Puri : హ‌ల్వా పూరీ.. మ‌న‌లో చాలా మంది దీనిని రుచి చూసే ఉంటారు. తియ్య‌గా ఉండే ఈ పూరీలను చాలా మంది ఇష్టంగా తింటారు.వీటిని ఎక్కువ‌గా గుంటూరు జిల్లాల వారు త‌యారు చేస్తూ ఉంటారు. ఈ పూరీల‌ను ఎవ‌రైనా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. తీపి తినాల‌నిపించిన‌ప్పుడు అప్ప‌టిక‌ప్పుడు వీటిని త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. ఒక్క‌సారి రుచి చూస్తే మ‌ళ్లీ మ‌ళ్లీ ఇవే కావాలంటారు పిల్ల‌లు. ఎంతో రుచిగా ఉండే ఈ హ‌ల్వా పూరీల‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

హ‌ల్వా పూరీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నెయ్యి – ఒక టేబుల్ స్పూన్, ఉప్మా ర‌వ్వ – పావుకిలో, పాలు -పావులీట‌ర్, నీళ్లు – పావు లీట‌ర్, పంచ‌దార – ముప్పావు క‌ప్పు, యాల‌కుల పొడి – ఒక టీ స్పూన్, మైదాపిండి – 2 క‌ప్పులు.

Halwa Puri recipe make in this method for taste
Halwa Puri

హ‌ల్వా పూరీ త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడ‌య్యాక ఉప్మా ర‌వ్వ వేసి వేయించాలి. ర‌వ్వ‌ను దోర‌గా వేయించిన త‌రువాత ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత అదే క‌ళాయిలో నీళ్లు, పాలు, పంచ‌దార వేసి మ‌రిగించాలి. పాలు మ‌రిగిన త‌రువాత యాల‌కుల పొడి వేసి క‌ల‌పాలి. త‌రువాత వేయించిన ర‌వ్వ వేసి క‌ల‌పాలి. దీనిని ఉండ‌లు లేకుండా క‌లుపుకున్న త‌రువాత ద‌గ్గ‌ర ప‌డే వ‌ర‌కు ఉడికించాలి. ర‌వ్వ ఉడికి ద‌గ్గ‌ర ప‌డిన త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి చ‌ల్లార‌నివ్వాలి. త‌రువాత గిన్నెలో మైదాపిండి తీసుకుని త‌గిన‌న్ని నీళ్లు పోసుకుంటూ మెత్త‌గా క‌లుపుకోవాలి. త‌రువాత ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి మ‌రోసారి వ‌త్తుతూ క‌లుపుకుని మూత పెట్టి అర‌గంట పాటు నాన‌బెట్టాలి. త‌రువాత పాలిథిన్ క‌వ‌ర్ ను తీసుకుని దానికి నూనె రాయాలి. త‌రువాత‌ చేతుల‌కు నూనె రాసుకుని నిమ్మ‌కాయంత పిండిని తీసుకుని ముందుగా వెడ‌ల్పుగా వ‌త్తుకోవాలి. త‌రువాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ ర‌వ్వ మిశ్ర‌మాన్ని ఉంచి అంచుల‌ను మూసి వేయాలి. త‌రువాత చేత్తో అరిసెల మాదిరి వ‌త్తుకోవాలి. ఇలా వ‌త్తుకున్న త‌రువాత వీటిని వేడి వేడి నూనెలో వేసి వేయించాలి. ఈ పూరీల‌ను రెండు వైపులా గోల్డెన్ క‌ల‌ర్ వ‌చ్చే వ‌ర‌కు వేయించి టిష్యూ పేప‌ర్ ఉంచిన ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే హ‌ల్వా పూరీ త‌యార‌వుతుంది. దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts