Hotel Style Idli : మనం అల్పాహారంగా తీసుకునే ఆహార పదార్థాల్లో ఇడ్లీలు ఒకటి. ఈ ఇడ్లీలను చాలా మంది ఇష్టంగా తింటారు. వీటిని తరచూ మనం ఇంట్లో కూడా తయారు చేస్తూ ఉంటాం. అలాగే హోటల్స్ లో కూడా ఇడ్లీలు మనకు లభిస్తూ ఉంటాయి. హోటల్స్ లభించే ఇడ్లీలు మెత్తగా, తెల్లగా, రుచిగా చాలా బాగుంటాయి. ఇలా హోటల్స్ లో లభించే విధంగా ఉండే ఈ ఇడ్లీలను మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. మెత్తగా, రుచిగా, చక్కగా ఉండేలా ఇడ్లీలను ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
హోటల్ స్టైల్ ఇడ్లీ తయారీకి కావల్సిన పదార్థాలు..
మినపప్పు – ఒక కప్పు, మెంతులు – పావు టీ స్పూన్, ఇడ్లీ రవ్వ – రెండున్నర కప్పులు, ఉప్పు – తగినంత, అటుకులు – అర కప్పు.
హోటల్ స్టైల్ ఇడ్లీ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో మినపప్పును తీసుకుని నీళ్లు పోసి శుభ్రంగా కడగాలి. తరువాత అందులో మెంతులు, తగినన్ని నీళ్లు పోసి 5 నుండి 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. మినపప్పును మిక్సీ పట్టుకోవడానికి అర గంట ముందు గిన్నెలో రవ్వను తీసుకుని శుభ్రంగా కడగాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి అర గంట పాటు నానబెట్టుకోవాలి. అలాగే అటుకులను కూడా కడిగి అర గంట పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు జార్ లో మినపప్పు, అటుకులు వేసి తగినన్ని నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత రవ్వను నీళ్లన్నీ పోయేలా చేత్తో పిండుతూ పిండిలో వేసుకోవాలి. తరువాత అంతా కలిసేలా చేత్తో కానీ గంటెతో కానీ ఒకే దిశలో 5 నిమిషాల పాటు కలుపుకోవాలి. తరువాత దీనిపై మూత పెట్టి ఒక రాత్రంతా పిండిని పులియబెట్టాలి.
ఉదయాన్నే ఈ పిండిని మరలా అలాగే ఒకే దిశలో కలుపుకుని తగినంత పిండిని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో ఉప్పు వేసి కలపాలి. ఇప్పుడు ఇడ్లీ కుక్కర్ లో నీళ్లు పోసి మూత పెట్టి 10 నిమిషాల పాటు వేడి చేయాలి. తరువాత పిండిని ప్లేట్ లల్లో వేసుకుని కుక్కర్ లో ఉంచాలి. వీటిని 10 నుండి 15 నిమిషాల పాటు మధ్యస్థ మంటపై ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఇడ్లీలను బయటకు తీసి కొద్దిగా చల్లారిన తరువాత ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా హోటల్స్ లో లభించే విధంగా ఉండే ఇడ్లీలను మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. వీటిని సాంబార్, పల్లి చట్నీ, కొబ్బరి చట్నీలతో తింటే చాలా రుచిగా ఉంటాయి. ఈ విధంగా చేసిన ఇడ్లీలను అందరూ ఇష్టంగా తింటారు.