చేపలతో వేపుడు, పులుసు, కూర ఎవరైనా చేసుకుని తింటారు. అయితే చికెన్, మటన్ లాగే చేపలతో కూడా బిర్యానీ వండుకుని తినవచ్చు. కొంత శ్రమ, కాసింత ఓపిక ఉండాలే కానీ ఘుమ ఘుమలాడే చేపల బిర్యానీ చేసేందుకు ఎంతో సమయం పట్టదు. పైగా ఆ బిర్యానీ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మరి చేప బిర్యానీని ఎలా తయారు చేయాలో, అందుకు కావల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
చేప బిర్యానీ తయారీకి కావల్సిన పదార్థాలు:
చేప ముక్కలు – 1/2 కిలో, షాజీరా – 1 టీస్పూన్, బాస్మతి బియ్యం – 4 కప్పులు, ఉల్లి పాయలు – 1/4 కిలో, పచ్చి మిర్చి – 12, పుదీనా – 1 కట్ట, కొత్తిమీర – 1 కట్ట, కారం – 1 టీస్పూన్, పసుపు – 1/4 టీస్పూన్, ఉప్పు – రుచికి సరిపడా, నూనె – వేయించడానికి సరిపడా, మిరియాల పొడి – 1 టీస్పూన్, నెయ్యి – 50 గ్రాములు, గరం మసాలా – 1/2 టేబుల్ స్పూన్, పెరుగు – 1 కప్పు, నిమ్మరసం – 3 టేబుల్ స్పూన్లు, కుంకుమ పువ్వు – కొద్దిగా (నాలుగు టేబుల్ స్పూన్ల గోరువెచ్చని పాలలో నానబెట్టాలి), అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 టేబుల్ స్పూన్లు.
చేప బిర్యానీ తయారుచేసే విధానం:
ఒక పాన్ లేదా మందంగా ఉన్న గిన్నె తీసుకుని అందులో ముందుగా నెయ్యి వేయాలి. అనంతరం అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, నిలువుగా చీరిన 4 లేదా 5 పచ్చి మిరపకాయలు, కొద్దిగా పుదీనా ఆకులు, ఉప్పు, గరం మసాలా వేసి ఒక నిమిషం పాటు వేయించాలి. తరువాత బాస్మతి బియ్యం వేసి తగినన్ని నీళ్లు పోసి సగం ఉడికించాలి. కడిగిన చేప ముక్కలకు కొద్దిగా నిమ్మరసం, కారం, పసుపు, పెరుగు, ఉప్పు బాగా పట్టించాలి. అనంతరం కళాయిలో 1 టీస్పూన్ నూనె వేసి మిగిలిన వాటిలో నుంచి సగం పచ్చి మిరపకాయలు, సగం పుదీనా ఆకులు, కొత్తిమీర తురుం వేసి 2 నిమిషాలు బాగా వేయించాలి. అనంతరం చల్లారనివ్వాలి. ఆ తరువాత ముద్దగా చేసుకుని మిరియాల పొడితో సహా చేప ముక్కలకు ఆ మిశ్రమాన్ని బాగా పట్టించాలి. కళాయిలో కొద్దిగా నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. అనంతరం పొడవుగా చీల్చిన మిగిలిన పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర తురుం కూడా వేసి బాగా వేయించి తీసి పక్కన పెట్టాలి. మందంగా ఉండే గిన్నెలో ఒక టీస్పూన్ నూనె వేసి అన్నీ పట్టించి ఉంచుకున్న చేప ముక్కల మిశ్రమాన్ని పరిచి దాని మీద ఉల్లిముక్కల మిశ్రమాన్ని చల్లి నిమ్మరసం పిండాలి. వాటి మీద సగం ఉడికించిన అన్నం వేసి అనంతరం ఒక టీస్పూన్ వేడి నూనె, టీస్పూన్ నెయ్యి చల్లుకోవాలి. వాటి మీద కుంకుమ పువ్వు కలిపిన పాలు పోసి మూత పెట్టి సిమ్‌లో 25 నిమషాల పాటు ఉడికించాలి. అంతే.. ఘుమ ఘుమలాడే వేడి వేడి చేప బిర్యానీ రెడీ అవుతుంది.