Paneer Bites : సాయంత్రం అయిందంటే చాలు చాలా మంది ఏం చిరుతిండి తిందామా అని ఆలోచిస్తుంటారు. ఈ క్రమంలోనే కొందరు రహదారుల పక్కన లభించే నూనె పదార్థాలను తింటారు. కొందరు బేకరీ ఫుడ్స్ తింటారు. అయితే ఇవన్నీ మనకు హాని కలిగించేవే. చక్కగా ఇంట్లోనే తయారు చేసి స్నాక్స్ తింటే మనకు ఎలాంటి హాని ఉండదు. ఇక ఇంట్లో చేసుకోదగిన స్నాక్స్‌లో పనీర్ బైట్స్ కూడా ఒకటి. వీటి తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటో.. వీటిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పనీర్ తురుము – 100 గ్రాములు, శనగపిండి – 100 గ్రాములు. ఉల్లిపాయ – 1, పచ్చిమిర్చి – 1, అల్లం తురుము – 1 టీస్పూన్, జీలకర్ర – అర టీస్పూన్, కరివేపాకు – 4 రెబ్బలు, కొత్తిమీర – 1 కట్ట, బేకింగ్ పౌడర్ – అర టీస్పూన్, నూనె – వేయించడానికి సరిపడా, ఉప్పు – తగినంత.
పనీర్ తురుములో శనగపిండి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, సన్నగా తురిమిన పుదీనా, కరివేపాకు వేసి కలపాలి. బేకింగ్ పౌడర్, ఉప్పు, జీలకర్ర, తగినన్ని నీళ్లు పోసి మృదువుగా కలిపి గుండ్రని బంతుల్లా తయారు చేయాలి. ఇప్పుడు వీటిని కాగిన నూనెలో బంగారు రంగులోకి వచ్చే వరకు వేయించి తీసి పుదీనా చట్నీతో కానీ టమాటా సాస్ కానీ తినవచ్చు. ఎంతో రుచిగా ఉంటాయి. వీటిని అందరూ ఇష్టంగా తింటారు.