Veg Kurma : ఎల్లప్పుడూ ఇంట్లో వండుకున్న ఆహారాలనే తినాలని.. బయట హోటల్స్ లేదా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలోని ఆహారాలను తినకూడదని మనకు వైద్యులు ఎప్పుడూ చెబుతుంటారు. బయటి ఫుడ్స్‌ను అపరిశుభ్రమైన వాతావరణంలో వండుతారు. పైగా వారు వాడే పదార్థాలు అంత స్వచ్ఛంగా ఉండవు. అందువల్ల అలాంటి ఆహారాలను మనం తింటే వ్యాధుల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుకనే బయటి ఫుడ్స్‌ను తినకూడదని డాక్టర్లు చెబుతుంటారు. అయితే బయట మనకు లభించే అనేక ఆహారాల్లో వెజ్ కుర్మా కూడా ఒకటి.
వెజ్ కుర్మా మనకు సహజంగానే రెస్టారెంట్లలో లభిస్తుంది. కొందరు బయట బండ్లపై కూడా ఈ కుర్మాను పరాటాలు లేదా రోటీలతో విక్రయిస్తుంటారు. కానీ ఇవి ఆరోగ్యానికి అంత మంచివి కావు. కనుక ఈ కుర్మాను మనం ఇంట్లోనే చేసుకోవాలి. అయితే ఇందుకు పెద్దగా శ్రమించాల్సి వస్తుందని చాలా మంది అనుకుంటారు. కానీ కాస్త కష్టపడితే చాలు.. బయటి కన్నా అద్భుతమైన టేస్ట్‌తో ఇంట్లోనే మనమే ఎంతో ఈజీగా వెజ్ కుర్మాను తయారు చేసుకోవచ్చు. ఇక దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటో, దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
తురిమిన లేత కొబ్బరి లేదా ఎండు కొబ్బరి – 1 కప్పు, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, వెల్లుల్లి రెబ్బలు – 2 లేదా 3, అల్లం – 1 ఇంచు ముక్క, పచ్చి మిర్చి – 2 లేదా 3 (కారం ఎక్కువ కావాలంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు), జీలకర్ర – అర టీస్పూన్, ధనియాలు – అర టీస్పూన్, సోంపు గింజలు – అర టీస్పూన్, పసుపు – పావు టీస్పూన్, గరం మసాలా – అర టీస్పూన్.
నూనె లేదా నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు, తరిగిన ఉల్లిపాయ పెద్దది – 1, మిక్స్‌డ్ వెజిటబుల్స్ – ఒక కప్పు (క్యారెట్లు, పచ్చి బఠానీలు, బీన్స్, ఆలుగడ్డలు, చిన్న ముక్కలుగా కట్ చేయాలి), టమాటా పెద్దది – 1 (సన్నగా తరగాలి), కొబ్బరి పాలు లేదా పెరుగు – అర కప్పు, జీలకర్ర – అర టీస్పూన్, ఆవాలు – అర టీస్పూన్, పసుపు – అర టీస్పూన్, కారం – అర టీస్పూన్ (అవసరం అయితే ఎక్కువ వేసుకోవచ్చు), గరం మసాలా – 1 టీస్పూన్, ఉప్పు – రుచికి సరిపడా, కొత్తిమీర ఆకులు గార్నిష్ కోసం – కొన్ని.
ఒక బ్లెండర్ లేదా ఫుడ్ ప్రాసెసర్ తీసుకుని అందులో తురిమిన కొబ్బరి, తరిగిన ఉల్లిపాయ, వెల్లుల్లి రెబ్బలు, అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, ధనియాలు, సోంపు గింజలు, పసుపు, గరం మసాలా వేసి అవసరం అయితే నీళ్లను కలుపుకుంటూ మెత్తని పేస్ట్‌లా పట్టుకోవాలి. దీన్ని పక్కన పెట్టాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మీడియం మంటపై ఉంచి ఒక పెద్ద పాన్ పెట్టి అందులో నూనె లేదా నెయ్యి వేసి వేడి చేయాలి. అందులోనే తరిగిన ఉల్లిపాయలు వేసి బంగారు గోధుమ రంగు వచ్చే వరకు వేయించాలి.
అందులోనే జీలకర్ర, ఆవాలు వేసి చిటపటలాడించాలి. తరువాత తరిగిన టమాటా ముక్కలు వేసి అవి మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. అనంతరం ముందుగా సిద్ధం చేసుకున్న కుర్మా పేస్ట్‌ను వేసి బాగా కలపాలి. దీన్ని కొన్ని నిమిషాల పాటు ఉడికించాలి. నూనె పైకి తేలుతున్న సమయంలో మిక్స్‌డ్ వెజిటబుల్స్‌ను వేసి కలపాలి. అయితే వెజిటబుల్స్‌కు కుర్మా పేస్ట్ పట్టేలా ఉడికించాలి. అనంతరం అందులో పసుపు, కారం, గరం మసాలా, ఉప్పు వేసి బాగా కలపాలి.
తరువాత స్టవ్‌ను సన్నని మంటపై ఉంచి అందులో పెరుగు లేదా కొబ్బరి పాలను వేస్తూ బాగా కలపాలి. స్టవ్‌ను సన్నని మంటపైనే ఉంచాలి. కూరగాయలు బాగా ఉడికేలా, సాస్ గట్టి పడే వరకు స్టవ్‌ను అలాగే 15 నుంచి 20 నిమిషాల పాటు ఉంచాలి. తరువాత ఉప్పు సరిగ్గా కలిసిందో లేదో చెక్ చేసి అవసరం అయితే కాస్త ఉప్పు కలుపుకోండి. అనంతరం కొత్తిమీర ఆకులతో గార్నిష్ చేయండి. దీంతో ఎంతో టేస్టీగా ఉండే వెజిటబుల్ కుర్మా లేదా వెజ్ కుర్మా రెడీ అవుతుంది. దీన్ని అన్నంలో కలిపి తినవచ్చు. లేదా వెజ్ బిర్యానీలో కలిపి తినవచ్చు. అయితే పరాటా లేదా రోటీలలో దీన్ని తింటే ఎంతో బాగుంటుంది. ఇలా వెజ్ కుర్మాను ఇంట్లోనే రుచిగా తయారు చేసుకోవచ్చు. దీన్ని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.