Potatoes : ఆలుగడ్డలు అంటే మనలో చాలా మందికి ఇష్టమే. వీటితో చాలా మంది అనేక రకాల వంటలను చేస్తుంటారు. తరచూ మనం ఆలుగడ్డలను ఇళ్లలో కూరల్లో ఉపయోగిస్తుంటాం. అలాగే పలు రకాల రైస్ వంటకాల్లోనూ ఆలుగడ్డలను వేస్తుంటాం. ఆలుగడ్డలతో కొందరు టమాటా కూర, వేపుడు, పులుసు వంటివి చేస్తారు. కొందరు చిప్స్ చేసి లాగించేస్తారు. అయితే ఇదంతా బాగానే ఉంది కానీ.. డయాబెటిస్ ఉన్నవారు ఆలుగడ్డలను తినాలంటే భయపడుతుంటారు. ఎందుకంటే ఆలుగడ్డల్లో కార్బొహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి.
కనుక ఆలుగడ్డలను తిన్న వెంటనే రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరిగిపోతాయని డయాబెటిస్ పేషెంట్లు విశ్వసిస్తారు. అయితే ఇందులో వాస్తవం ఎంత ఉంది..? నిజంగానే డయాబెటిస్ ఉన్నవారు ఆలుగడ్డలను తినకూడదా..? తింటే ఏమవుతుంది..? అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. డయాబెటిస్ ఉన్నవారు కూడా నిర్భయంగా ఆలుగడ్డలను తినవచ్చు. దీంతో షుగర్ లెవల్స్ పెరుగుతాయని భయపడాల్సిన పనిలేదు. ఈ విషయాన్ని సైంటిస్టులు తమ తాజా అధ్యయనాల్లో వెల్లడించారు. ఇంతకీ వారు ఏమన్నారంటే..
అమెరికాలోని లాస్ వెగాస్‌లో ఉన్న యూనివర్సిటీ ఆఫ్ నెవాడాకు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ నెడా అఖవాన్ ఈ మధ్యే ఒక అధ్యయనం చేపట్టారు. డయాబెటిస్ ఉన్నవారు ఆలుగడ్డలను తింటే షుగర్ లెవల్స్ ఏవిధంగా పెరుగుతాయి.. అన్న అంశంపై వారు అధ్యయనం చేశారు. దీంతో తేలిందేమిటంటే.. డయాబెటిస్ ఉన్నవారు షుగర్ లెవల్స్ పెరగకుండా ఉండాలంటే ఆలుగడ్డలను స్వల్ప మొత్తంలో తినవచ్చు. దీంతో భయపడాల్సిన పనిలేదు.
అయితే షుగర్ ఉన్నవారు ఆలుగడ్డలను కేవలం ఉడికించి మాత్రమే తినాలి. ఇతర ఏ రూపంలోనూ తినకూడదు. అంటే ఆలును వేపుళ్లు, చిప్స్, రోస్ట్ లాంటి రూపాల్లో తినకూడదన్నమాట. ఇలా తింటే డయాబెటిస్ ఉన్నవారికే కాదు, ఆరోగ్యవంతులకు కూడా ప్రమాదమే అని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. ఆలుగడ్డలను ఉడికించి తింటేనే మంచిదని అంటున్నారు. వాటిని వేయించి లేదా చిప్స్ రూపంలో తినొద్దని సూచిస్తున్నారు. డయాబెటిస్ ఉన్నవారు స్వల్ప మొత్తంలో ఆలుగడ్డలను ఉడికించి తినవచ్చని, దీంతో షుగర్ లెవల్స్ పెరుగుతాయని భయపడాల్సిన పనిలేదని సైంటిస్టులు చెబుతున్నారు. కనుక డయాబెటిస్ ఉన్నవారు ఈ విధంగా ఆలుగడ్డలను తినవచ్చు. దీంతో ఎలాంటి ఢోకా ఉండదు.