Idli Upma : మిగిలిపోయిన ఇడ్లీల‌ను ప‌డేయ‌కండి.. వాటితో ఎంచ‌క్కా ఇలా ఉప్మా చేయ‌వ‌చ్చు..!

Idli Upma : మ‌నం అల్పాహార‌గంగా తీసుకునే వాటిలో ఇడ్లీలు కూడా ఒక‌టి. ఇడ్లీలను చాలా మంది ఇష్టంగా తింటారు. ఒక్కోసారి మ‌న ఇంట్లో ఇడ్లీలు మిగిలి పోతూ ఉంటాయి. మిగిలిన చ‌ల్లారిన ఇడ్లీలను ఎవ‌రూ తిన‌రు. అలా అని వాటిని ప‌డేయ‌లేము. మిగిలిన ఇడ్లీల‌ను ప‌డేయ‌కుండా వాటితో ఎంతో రుచిగా ఉండే ఉప్మాను తయారు చేసుకోవ‌చ్చు. ఇడ్లీల‌తో చేసే ఈ ఉప్మా చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. సాయంత్రం స‌మ‌యంలో స్నాక్స్ గా కూడా ఈ ఉప్మాను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. మిగిలిన ఇడ్లీల‌తో ఉప్మాను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ఇడ్లీ ఉప్మా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ఇడ్లీలు – 8, నూనె – 2 టేబుల్ స్పూన్స్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, జీడిప‌ప్పు ప‌లుకులు లేదా ప‌ల్లీలు – కొన్ని, అల్లం తరుగు – ఒక టీ స్పూన్, చిన్న‌గా త‌రిగిన ప‌చ్చిమిర్చి – 4, త‌రిగిన ఉల్లిపాయ – 1, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, ఉప్పు – త‌గినంత‌, ప‌సుపు – పావు టీ స్పూన్, నిమ్మ‌ర‌సం – అర చెక్క‌.

Idli Upma recipe in telugu very tasty easy to make
Idli Upma

ఇడ్లీ ఉప్మా త‌యారీ విధానం..

ముందుగా ఇడ్లీల‌ను పొడి పొడిగా చేసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక తాళింపు దినుసులు, జీడిప‌ప్పు వేసి వేయించాలి. ఇవి వేగిన త‌రువాత అల్లం తరుగు, ప‌చ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్క‌లు, క‌రివేపాకు వేసి వేయించాలి. ఇందులోనే ఉప్పు, ప‌సుపు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్క‌లు వేగిన త‌రువాత పొడి పొడిగా చేసుకున్న ఇడ్లీల‌ను వేసి క‌ల‌పాలి. దీనిని అంతా క‌లిసేలా క‌లుపుకున్న త‌రువాత ఒక నిమిషం పాటు వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత నిమ్మ‌ర‌సం వేసి క‌లిపి స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఇడ్లీ ఉప్మా త‌యార‌వుతుంది. ఇడ్లీల‌ను తిన‌ని వారు కూడా ఈ ఉప్మాను ఇష్టంగా తింటారు. మిగిలిన ఇడ్లీల‌తోనే కాకుండా తాజా ఇడ్లీల‌తో కూడా ఇలా ఉప్మాను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు.

Share
D

Recent Posts