బెజవాడ (విజయవాడ) – గుంటూరు నగరాలే కాదు, కృష్ణా – గుంటూరు జిల్లాల ప్రజల మధ్యన కూడా యాస, ఆహారపు అలవాట్లు, ఆచారాలు – సంప్రదాయాలు కొంత తేడా ఉంటాయి. చివరికి అవనిగడ్డ – తెనాలి గట్లవారు కూడా కొన్ని విషయాలలో ఎకసెక్కాలు ఆడుకుంటారు. చారిత్రకముగా చూసుకుంటే కృష్ణా నది చాలా వంశాల పాలనలో సరిహద్దు ప్రాంతముగా ఉన్నది. విజయవాడ ప్రాంతము ఎక్కువ శతాబ్దాలు వేంగీ, రాజమహేంద్రవరము, కళింగ ప్రాంతాలు రాజధానిగా ఏలిన రాజ్యములలో ఉంటే, గుంటూరు ఎక్కువ చేబ్రోలు, కొండవీడు రెడ్డి రాజులు, కృష్ణదేవరాయల పాలనలో ఉన్నది. నాకు చరిత్రపై ఎక్కువ పట్టు లేదుగానీ పైన చెప్పినది కొంత పై స్థాయిలో.
విజయవాడ 16వ శతాబ్దం దాకా పెద్ద గ్రామమే అయినా తర్వాత నిర్లక్ష్యం కాబడింది. మళ్ళీ 19వ శతాబ్దంలో నదిపై ఆనకట్ట (ప్రకాశం బ్యారేజి ముందర) కట్టాక, కలకత్తా – మద్రాసు జీటీ రోడ్డు వచ్చాక కూడా లారీలు ఇక్కడ నదిపై పంటు (బల్లకట్టు)లపైనే దాటించేవారు. 17–19 వ శతాబ్దాల మధ్యన మచిలీపట్నము ప్రధాన కేంద్రము. అందులోనూ 17–18 లలో డచ్ ప్రభావము ఎక్కువ. గుంటూరు 18 వ శతాబ్దములో ఫ్రెంచి పాలనలో ఉన్నది. తరువత కొంతకాలం నిజాం పాలనలో ఉన్నది. ఆ సమయములో ముస్లింల సంఖ్య పెరిగినది. నాకు బాగా గుర్తు – 90 లలో అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో 8 జిల్లాలలో ఉర్దూను రెండవ అధికార భాషగా గుర్తిస్తే తెలంగాణా జిల్లాలు కాకుండా గుంటూరు, కర్నూలు జిల్లాలు ఉన్నాయి. 19వ శతాబ్దములో బ్రిటీషు వారి కిందకు వచ్చి జిల్లా కేంద్రమయ్యాక క్రైస్తవ మిషనరీలు గుంటూరు కేంద్రముగా పెరిగాయి. వారు స్థాపించిన విద్యా, వైద్య సంస్థల వలన గుంటూరు విద్యా వైద్య కేంద్రముగా పెరిగినది.
అందువలన క్రైస్తవ జనాభా కూడా విజయవాడ కన్నా ముందు గుంటూరులోనే పెరిగినది. పాత గుంటూరులోని ఆర్. అగ్రహారం, అప్పటి బ్రిటీషు కలెక్టర్ల పేర్ల పైన ఏర్పడిన బ్రాడీపేట, అరండలుపేట లలో బ్రాహ్మణులు స్థిరపడడము, బ్రాడీపేట రెండవ లైనులో స్థిరపడిన మార్వాడీ జైనులు – అలా గుంటూరులో అన్ని మతాల ప్రజలు కలిసిపోయారు. ఇక స్వాతంత్య్రం తర్వాత విజయవాడకు తెలంగాణ నుంచి వలసలు, ముఖ్యంగా కమ్యూనిష్టుల వలసలు పెరిగాయి. 1957లో ప్రకాశం బ్యారేజి వచ్చాక లారీలకి కనెక్టివిటీ పెరిగింది. రైల్వేలతో పాటు, రెండు ముఖ్య జాతీయ రహదారులకు జంక్షనుగా మారడం, పత్రికా-వ్యాపార-రాజకీయ-సినిమా-రచనా కేంద్రంగా త్వరగా పెరగడం మొదలైంది. గుంటూరు విద్యా వైద్య వాణిజ్య (మిర్చి, పత్తి, పొగాకు) పంటల కేంద్రంగా పెరిగింది.
భౌగౌళికముగా చూసుకుంటే విజయవాడ, అలాగే కృష్ణ జిల్లా నందిగామ – జగ్గయ్యపేట, కనీసం కంచికచర్ల వరకూ పంటలు పండే పచ్చటి ప్రాంతమే. మరీ డెల్టా అంత కాకున్నా వరి పండే సారవంతమైన నేలనే. అదే గుంటూరు డెల్టా ముగిసి మెట్ట ప్రాంతము మొదలయ్యే ప్రాంతము. గుంటూరు ఛానెల్ కాలవ తవ్వేవరకు మంచినీటి సమస్య ఉండేది. విజయవాడకు వలసలు గోదావరి, ఉత్తరాంధ్ర, గుడివాడు నుంచి అయితే గుంటూరుకు పలనాడు, ఇప్పటి ప్రకాశం (అప్పట్లో గుంటూరు జిల్లానే) మెట్ట ప్రాంతాల నుండి వచ్చిన వలసలు. డెల్టా ప్రాంతానికి తెనాలి, బాపట్ల పెద్ద ఊర్లు ఉన్నాయి. అందుకని విజయవాడలో స్థిరపడిన జనాభాలో ఎక్కువ మాగాణీ రైతులు, ముఠా కూలీలు, కమ్యూనిష్టులు అయితే గుంటూరులో స్థిరపడిన జనాభాలో ఎక్కువ మెట్ట ప్రాంతపు రైతులు, రైతు కూలీలు, విద్యావేత్తలు, ప్రోఫెసర్లు, పొగాకు-పత్తి-మిర్చి వ్యాపారులు, వగైరా. అందుచేత ఈ రెండు నగరాల డెమోగ్రాఫిక్స్ వేరు. ఈ కారణాల వలన ఆహారపు అలవాట్లు కూడా కొంత తేడా ఉన్నది.