స్మార్ట్‌ఫోన్లు అనేవి నేటి తరుణంలో మనకు నిత్య జీవితంలో ఒక భాగం అయిపోయాయి. ఒక మాటలో చెప్పాలంటే.. అవి లేకుండా మనం ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నాం. అంతలా అవి మన జీవితాలను ప్రభావితం చేస్తున్నాయి. అసలవి మనకు నిత్యావసర వస్తువులుగా మారిపోయాయి. అయితే ఇంత వరకు బాగానే ఉన్నా, ప్రస్తుతం పిల్లలు కూడా ఫోన్లకు బాగా అడిక్ట్ అవుతున్నారు. అస్తమానం గేమ్స్ ఆడడం, ఫేస్‌బుక్, వాట్సాప్ దర్శించడం వంటి పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో వారికి ఫోన్లను ఇవ్వకపోతే అలగడం వంటి పనులు చేస్తున్నారు. అయితే అలాంటి ఇబ్బంది లేకుండా, పిల్లల స్మార్ట్‌ఫోన్ వాడకాన్ని కట్టడి చేయాల్సిన అవసరం లేకుండానే పలు రూల్స్‌ను వారికి పెడితే చాలు. దాంతో వారు స్మార్ట్‌ఫోన్లను వాడుకోవచ్చు. ఆ రూల్స్ వల్ల ఎలాంటి ఇబ్బందులు రావు. మరి పిల్లలను స్మార్ట్‌ఫోన్ల వాడకం పట్ల కంట్రోల్‌లో ఉంచాలంటే పేరెంట్స్ పెట్టాల్సిన రూల్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందామా.
1. రాత్రి పూట ఫోన్లను ఇవ్వకండి
పిల్లలకు రోజులో ఎప్పుడైనా ఫోన్లను ఇవ్వండి కానీ రాత్రి పూట ఫోన్లను ఇవ్వకండి. అది వారి నిద్రపైనే కాదు, ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. దీనికి తోడు ఆన్‌లైన్ పోర్నోగ్రఫీ ఎక్కువైనందున రాత్రి పూట పిల్లలకు ఫోన్లను ఇవ్వడం అంత మంచిది కాదు. ఆ సమయంలో తల్లిదండ్రులు పిల్లలపై నిఘా పెట్టలేరు. కనుక పేరెంట్స్ ఎవరైనా రాత్రి పూట తమ పిల్లలకు ఫోన్లను ఇవ్వకపోవడమే మంచిది. కచ్చితంగా ఈ రూల్‌ను పెట్టి మీ పిల్లలకు చెప్పండి.
2. పార్టీలు, భోజనాలప్పుడు
పేరెంట్స్ తో కలిసి పిల్లలు పార్టీలకు వెళ్లినప్పుడు లేదంటే ఇంట్లోనే ఫంక్షన్లు చేసుకున్నా, భోజనాలు చేసే సమయంలో అయినా పిల్లలకు ఫోన్లను ఇవ్వకండి. ఎందుకంటే ఆ సమయాల్లో కూడా తల్లిదండ్రులు పిల్లలు ఏం చేస్తున్నారో సరిగ్గా గమనించలేరు. దీంతో వారు ఫోన్ల వల్ల చెడు ప్రభావానికి లోనయ్యే అవకాశం ఉంటుంది. కనుక ఆ సమయాల్లో ఫోన్లను పిల్లలకు ఇవ్వకుండా రూల్ పెట్టండి.
3. యాప్‌లు
ఫోన్లు ఇచ్చేటప్పుడు పిల్లలకు అవసరం ఉండే యాప్స్‌ను మాత్రమే వాటిల్లో అందుబాటులో ఉంచండి. కేవలం వారికి అవసరం అయ్యే గేమ్స్ లేదా ఇతర ఎడ్యుకేషన్ యాప్స్, పిల్లల కథలు, పాటలు వంటి యాప్స్‌ను మాత్రమే వారు చూసేట్టుగా ఫోన్లలో సెట్ చేసి ఇవ్వండి. మిగిలిన యాప్‌లకు లాక్‌లు పెట్టి ఆ తరువాత ఫోన్లను పిల్లలకు ఇవ్వండి. దీంతో వారు ఇతర ఏ వివరాలను ఫోన్‌లో చూసేందుకు వీలు కాదు. అలా సేఫ్‌గా ఉండవచ్చు.
4. కాంటాక్ట్‌లు
తల్లిదండ్రులు తమకు తెలిసిన వ్యక్తులకు చెందిన కాంటాక్ట్‌లను మాత్రమే పిల్లలను వాడుకునేలా చూడాలి. ఎందుకంటే అపరిచిత వ్యక్తులు అయితే వారు మీ పిల్లలను వేధింపులకు గురి చేయవచ్చు. వారిని హింసించవచ్చు. కనుక వారు ఫోన్లలో ఎవరెవరికి కాల్స్ చేస్తున్నారు అనే విషయంపై ఓ కన్నేయాలి.
5. వ్యక్తిగత సమాచారం
ఇంటర్నెట్‌లో కొన్ని యాప్‌లు లేదా సైట్లలో మనకు ఏవైనా సేవలు కావాలంటే అవి మన వ్యక్తిగత సమాచారాన్ని అడుగుతుంటాయి. అలాంటి సందర్భాల్లో పిల్లలపై నిఘా ఉంచాలి. వారిని ఇంటర్నెట్ వాడుకోకుండా నిషేధించాలి. ఇంటర్నెట్ అవసరం అయితే మీరు దగ్గరుండి వారికి కావల్సిన గేమ్స్ ఇన్‌స్టాల్ చేసివ్వాలి. సమాచారం వెదికి ఇవ్వాలి. అంతేకానీ వారి చేతికి ఫోన్ ఇచ్చి వారినే సమాచారం వెదుక్కోమని అవకాశం ఇవ్వకూడదు.