సాధారణంగా ఎవరూ కూడా చిరిగిన కరెన్సీ నోట్లను ఇస్తే తీసుకోరు. అవి మన చేతుల్లోకి అనుకోకుండా రావల్సిందే. ఇక కొన్ని అరుదైన సందర్భాల్లో ఏటీఎంల నుంచి కూడా మనకు చిరిగిన నోట్లు వస్తుంటాయి. ఇలా వస్తే ఆందోళన చెందాల్సిన పనిలేదు. అలాంటి నోట్లను సులభంగా మార్చుకోవచ్చు. కేవలం చిరిగిన నోట్లే కాదు, రంగు మారినవి, నోట్లపై ఉండే అక్షరాలు, చిహ్నాలు, బొమ్మలు చెరిగిపోయిన నోట్లను కూడా మార్చుకోవచ్చు. అందుకు గాను వినియోగదారులు ఏదైనా బ్యాంకును సందర్శించవచ్చు.
చిరిగిన లేదా దెబ్బ తిన్న, రంగు మారిన నోట్లను మార్చుకునేందుకు ఇంతకు ముందు ఆర్‌బీఐ శాఖలను సందర్శించాల్సి వచ్చేది. కానీ ఆర్‌బీఐ 2009 నియమాల ప్రకారం పబ్లిక్ లేదా ప్రైవేటు సెక్టార్ బ్యాంకులు వినియోగదారులు తెచ్చే నోట్లను మార్చి ఇవ్వాల్సి ఉంటుంది. వినియోగదారులు అందించే నోట్లు లేదా నాణేలను మార్చి వాటి విలువకు సమానం అయ్యే నోట్లను, నాణేలను ఇవ్వాలి. అలా చేయకపోతే వినియోగదారులు ఆ బ్యాంక్‌పై ఆర్‌బీఐకి ఫిర్యాదు చేయవచ్చు.
ఇక చిన్న ఫైనాన్స్ బ్యాంకులు, పేమెంట్ బ్యాంకులు నోట్లను, నాణేలను మార్చవచ్చు లేదా మార్చకపోవచ్చు. ఆ విషయంపై నిర్ణయాన్ని ఆర్‌బీఐ వాటికే వదిలేసింది. కానీ బ్యాంకుల్లో మాత్రం వాటిని కచ్చితంగా మార్చాల్సి ఉంటుంది. లేదంటే ఆర్‌బీఐ శాఖను సంప్రదించవచ్చు.