Immunity Laddu : ప్రతిరోజూ ఒక లడ్డూను తింటే చాలు మన శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాము. అంతేకాకుండా ఎముకలు ధృడంగా తయారవుతాయి. కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి. శరీరంలో ఇన్ ప్లామేషన్ తగ్గుతుంది. ఈ లడ్డూలను పిల్లలు, పెద్దలు, బాలింతలు ఎవరైనా తీసుకోవచ్చు. పిల్లలకు ఈ లడ్డూలను ఇవ్వడం వల్ల వారిలో ఎదుగుదల చక్కగా ఉంటుంది. శరీరం బలంగా, ధృడంగా తయారవుతుంది. శరీరంలో ఇమ్యూనిటీని పెంచడంతో పాటు చక్కటి ఆరోగ్యాన్ని అందించే ఈ లడ్డూలను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఇమ్యూనిటీ లడ్డూ తయారీకి కావల్సిన పదార్థాలు..
గోంధ్ – పావు కప్పు, గోధుమపిండి -ఒక కప్పు, నెయ్యి – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – చిటికెడు, కాచి చల్లార్చిన పాలు – 2 టేబుల్ స్పూన్స్, డ్రై ఫ్రూట్స్ – తగినన్ని, ఎండు కొబ్బరి తురుము – ముప్పావు కప్పు, యాలకుల పొడి -అర టీ స్పూన్, బెల్లం తరుము – ముప్పావు కప్పు.
ఇమ్యూనిటీ లడ్డూ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో గోధుమపిండిని తీసుకోవాలి. తరువాత ఇందులో ఉప్పు, నెయ్యి వేసి కలపాలి. తరువాతపాలను పోసుకుంటూ కలుసుకోవాలి. తరువాత దీనిపై మూత పెట్టి 15 నిమిషాల పాటు పక్కకు ఉంచాలి. తరువాత ఈ పిండిని జల్లెడలో వేసి జల్లించాలి. ఉండలుగా ఉన్న పిండిని చేత్తో నలుపుతూ జల్లించి గిన్నెలోకి తీసుకుని పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. తరువాత డ్రై ఫ్రూట్స్ వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత ఎండు కొబ్బరి తురుము వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో నెయ్యి వేసి వేయించాలి. తరువాత 2 టేబుల్ స్పూన్ల గోంధ్ ను వేసి వేయించాలి. వేయించడం వల్ల గోంధ్ తెల్లగా పొంగుతుంది. ఇలా వేగగానే గోంధ్ ను ప్లేట్ లోకి తీసుకోవాలి.
మరలా కొద్ది కొద్దిగా నెయ్యని, గోంధ్ ను వేసుకుంటూ వేయించి గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో మరికొద్దిగా నెయ్యి వేసి వేడి చేయాలి. తరువాత ముందుగా సిద్దం చేసుకున్న గోధుమ రవ్వను వేసి వేయించాలి. ఇప్పుడు ముందుగా వేయించిన గోంధ్ ను చేత్తో మెత్తగా చేసుకోవాలి. తరువాత ఇందులో వేయించిన డ్రై ఫ్రూట్స్, గోధుమ రవ్వ, యాలకుల పొడి వేసి కలపాలి. తరువాత కళాయిలో బెల్లం తురుము, 2 టేబుల్ స్పూన్స్ నీళ్లు పోసి వేడి చేయాలి. బెల్లం కరిగి తీగ పాకం వచ్చిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి వడకట్టాలి. తరువాత ఈ పాకాన్ని ముందుగా తయారు చేసుకున్న గోంధ్ మిశ్రమం వేసి కలపాలి. ఇది కొద్దిగా చల్లారిన తరువాత అంతా కలిసేలా కలుపుకుని కావల్సిన పరిమాణంలో లడ్డూలుగా చుట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఇమ్యూనిటీ లడ్డూ తయారవుతుంది. ఈ లడ్డూను రోజూ ఒకటి చొప్పున తినడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.