Instant Guntha Ponganalu : మనం ఉదయం పూట రకరకాల అల్పాహారాలను తయారు చేస్తూ ఉంటాం. వాటిలో దోశ పిండితో చేసే గుంత పొంగనాలు కూడా ఒకటి. వీటిని మనలో చాలా మంది రుచి చూసే ఉంటారు. వీటిని తయారు చేసే పెనం కూడా ప్రత్యేకంగా ఉంటుంది. ఇవి మనకు బయట బండ్ల మీద అల్పాహారంగా అలాగే స్నాక్స్ గా కూడా లభిస్తూ ఉంటాయి. ఈ గుంత పొంగనాలను మరింత రుచిగా ఎలా తయారు చేసుకోవాలి… తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి… అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
గుంత పొంగనాలు తయారు చేయడానికి కావల్సిన పదార్థాలు..
దోశ పిండి – ఒక పెద్ద కప్పు, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, క్యారెట్ తురుము – పావు కప్పు, ఉప్పు – తగినంత, జీలకర్ర – ఒక టీ స్పూన్, నూనె – ఒక టేబుల్ స్పూన్.
గుంత పొంగనాలు తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో దోశ పిండిని తీసుకోవాలి. తరువాత అందులో నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలుపుకోవాలి. తరువాత స్టవ్ మీద పొంగనాల పెన్నాన్ని ఉంచి అందులో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక గంటెతో పిండిని తీసుకుని పొంగనాల గుంతలో వేయాలి. తరువాత దీనిపై మూతపు ఉంచి 5 నిమిషాల పాటు ఉంచాలి. తరువాత మూత తీసి పొంగనాలను మరో వైపుకు తిప్పుకుని 2 నిమిషాల పాటు కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న తరువాత పొంగనాలను ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచికరమైన పొంగనాలు తయారవుతాయి. వీటిని పల్లి చట్నీ, టమాట చట్నీవంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి. సాధారణ దోశ పిండితో వేసే పొంగనాల కంటే ఇలా ఈ విధంగా తయారు చేసిన పొంగపాలు మరింత రుచిగా ఉంటాయి. వీటిని ఉదయం అల్పాహారంగా అలాగే సాయంత్రం స్నాక్స్ గా వేసుకుని తినవచ్చు. వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.