Instant Idli : మనం ఉదయం అల్పాహారంలో భాగంగా ఇడ్లీలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. ఇడ్లీ మిశ్రమాన్ని తయారు చేయడానికి సమయం ఎక్కువగా పడుతుంది. మనం ముందు రోజే ఇడ్లీ మిశ్రమాన్ని తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఇడ్లీ మిశ్రమాన్ని తయారు చేసుకునే సమయం లేని వారు అప్పటికప్పుడే ఇన్ స్టాంట్ గా ఇడ్లీలను తయారు చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న ఇడ్లీలు కూడా మినప పప్పుతో చేసిన ఇడ్లీల లాగా రుచిగా, మెత్తగా ఉంటాయి. ఇన్ స్టాంట్ గా ఇడ్లీలను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఇన్ స్టాంట్ ఇడ్లీ తయారీకి కావల్సిన పదార్థాలు..
ఇడ్లీ రవ్వ – ఒక కప్పు, అటుకులు – ఒక కప్పు, పుల్లని పెరుగు – ఒక కప్పు, ఉప్పు – తగినంత, వంటసోడా – ఒక టీ స్పూన్.
ఇన్ స్టాంట్ ఇడ్లీ తయారీ విధానం..
ముందుగా ఇడ్లీ రవ్వను శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లను పోసి 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. అటుకులను కూడా శుభ్రంగా కడిగి నీళ్లు లేకుండా చేసి పెరుగును వేసి బాగా కలిపి 10 నిమిషాల పాటు పక్కన ఉంచాలి. ఇప్పుడు జార్ లో అటుకులను వేసి మెత్తగా మిక్సీ పట్టి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ రవ్వలోని నీళ్లను పారబోసి ఇడ్లీ రవ్వలో ఉండే మిగిలిన నీరు అంతా పోయేలా చేత్తో పిండి అటుకుల మిశ్రమంలో వేసి కలుపుకోవాలి. ఇందులోనే తగినంత ఉప్పును, వంటసోడాను వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన మిశ్రమాన్ని ఇడ్లీ పాత్రలో వేసి మధ్యస్థ మంటపై 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇన్ స్టాంట్ ఇడ్లీలు తయారవుతాయి. ఇలా చేసిన ఇడ్లీలు కూడా మెత్తగా ఉంటాయి. పల్లి చట్నీ, సాంబార్ లతో కలిపి తింటే ఈ ఇడ్లీలు చాలా రుచిగా ఉంటాయి.