Kodiguddu Karam : మన శరీరానికి ప్రోటీన్స్ ఎంతో అవసరం. కణాలు, కణజాలాల నిర్మాణానికి, అవి ఆరోగ్యంగా ఉండడానికి ప్రోటీన్స్ ఎంతో అవసరం అవుతాయి. ఎముకలు దృఢంగా ఉండడానికి, పిల్లల ఎదుగుదలకు, గర్భిణీలకు ప్రోటీన్స్ ఎంతో అవసరం. తక్కువ ఖర్చులో, ఎక్కువ ప్రోటీన్స్ ను అందించే ఆహారాల్లో కోడిగుడ్లు ఒకటి. కోడిగుడ్లను తినడం వల్ల శరీరానికి కావల్సిన ప్రోటీన్స్ అన్నీ లభిస్తాయి.
కోడిగుడ్లను తినడం వల్ల ప్రోటీన్స్ తోపాటు శరీరానికి కావల్సిన ఇతర పోషకాలు కూడా లభిస్తాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో, కంటి చూపును మెరుగుపరచడంలో, బరువును తగ్గించడంలో కోడి గుడ్లు ఎంతో ఉపయోగపడతాయి. వీటిని ప్రతిరోజూ ఆహారంలో భాగంగా తీసుకోవాలని వైద్యులు కూడా సూచిస్తుంటారు. ఇక కోడిగుడ్లతో మనం రకరకాల వంటలను తయారు చేస్తుంటాం. అందులో భాగంగా చాలా సులువుగా, చాలా తక్కువ సమయంలో ఎంతో రుచిగా ఉండే కోడిగుడ్డు కారాన్ని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కోడి గుడ్డు కారం తయారీకి కావల్సిన పదార్థాలు..
ఉడికించిన కోడిగుడ్లు – 4, కారం – 2 టీ స్పూన్స్, ధనియాల పొడి – 2 టీ స్పూన్స్, పసుపు – చిటికెడు, వెల్లుల్లి రెబ్బలు – 15, ఉప్పు – తగినంత, నూనె – 4 టేబుల్ స్పూన్స్.
కోడి గుడ్డు కారం తయారీ విధానం..
ముందుగా రోట్లో వెల్లుల్లి రెబ్బలు, ధనియాల పొడి, ఉప్పు, కారం వేసి మెత్తగా దంచుకోవాలి. వీటిని జార్ లో వేసి కూడా మెత్తగా చేసుకోవచ్చు. ఇప్పుడు కళాయిలో నూనె వేసి కాగిన తరువాత పసుపును వేయాలి. అలాగే ఉడికించిన కోడి గుడ్లకు కత్తితో గాటు పెట్టి కళాయిలో వేయాలి. తరువాత గుడ్లను రంగు మారే వరకు వేయించాలి. ఇలా వేయించిన తరువాత ముందుగా తయారు చేసుకున్న వెల్లుల్లి మిశ్రమాన్ని వేసి కలుపుతూ చిన్న మంటపై 5 నిమిషాల పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కోడి గుడ్డు కారం తయారవుతుంది. కూరను తయారు చేయడానికి సమయం తక్కువగా ఉన్నప్పుడు ఇలా కోడిగుడ్లతో కారాన్ని తయారు చేసుకుని తినడం వల్ల రుచిగా ఉండడంతోపాటు కోడిగుడ్డులో ఉండే పోషకాలను, వాటి వల్ల కలిగే ప్రయోజనాలను పొందవచ్చు.