Instant Karam Dosa : దోశ పిండి లేకున్నా.. అప్ప‌టిక‌ప్పుడు ఇలా ఇన్‌స్టంట్ కారం దోశ‌ను వేసి తిన‌వ‌చ్చు..!

Instant Karam Dosa : మ‌నం అల్పాహారంగా దోశ‌ల‌ను కూడా తీసుకుంటూ ఉంటాము. దోశలు చాలా రుచిగా ఉంటాయి. మ‌న‌కు న‌చ్చిన రుచుల్లో ఈ దోశ‌ల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాము. అయితే దోశ‌పిండి లేకుండా కూడా దోశ‌ల‌ను త‌యారు చేసుకోవ‌చ్చ‌ని మీకు తెలుసా.. అవును కింద చెప్పిన విధంగా చేయ‌డం వ‌ల్ల మిన‌ప‌ప్పుతో ప‌నేలేకుండా దోశ‌పిండిని త‌యారు చేసుకోవ‌చ్చు. అలాగే ఈ దోశ‌పిండితో రుచిగా కారం దోశ‌ల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఉద‌యం పూట స‌మ‌యం త‌క్కువ‌గా ఉన్న‌ప్పుడు ఇలా అప్ప‌టిక‌ప్పుడు ఈ కారం దోశ‌ల‌ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ప‌ప్పు నాన‌బెట్టి రుబ్బే ప‌నిలేకుండా ఇన్ స్టాంట్ గా కారం దోశ‌ల‌ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇన్ స్టాంట్ కారం దోశ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ఉప్మార‌వ్వ – ఒక క‌ప్పు, పంచ‌దార – ఒక టీ స్పూన్, నూనె – 2 టీ స్పూన్స్, గోధుమ‌పిండి – 2 టేబుల్ స్పూన్స్, బియ్యంపిండి – 2 టేబుల్ స్పూన్స్, పెరుగు – ఒక క‌ప్పు, నీళ్లు – ఒక క‌ప్పు, ఉప్పు – త‌గినంత‌, వంట‌సోడా – 1/3 టీ స్పూన్, షెజ్వాన్ సాస్ – ఒక టేబుల్ స్పూన్, గ‌రం మ‌సాలా – పావు టీ స్పూన్, సాంబార్ మ‌సాలా పొడి – పావు టీ స్పూన్, క్యారెట్ తురుము – కొద్దిగా, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ ముక్క‌లు – కొద్దిగా.

Instant Karam Dosa recipe in telugu make in this way
Instant Karam Dosa

ఇన్ స్టాంట్ కారం దోశ త‌యారీ విధానం..

ముందుగా జార్ లో ఉప్మా ర‌వ్వ‌, పంచ‌దార‌, నూనె వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత ఇందులో గోధుమ‌పిండి, బియ్యంపిండి, పెరుగు, నీళ్లు, ఉప్పు, వంట‌సోడా వేసి క‌ల‌పాలి. ఇలా అన్నింటిని క‌లుపుకున్న త‌రువాత మూత పెట్టి 10 నిమిషాల పాటు ప‌క్క‌కు ఉంచాలి. ర‌వ్వ నానిన త‌రువాత అవ‌స‌ర‌మైతే మ‌రికొన్ని నీళ్లు పోసి దోశ పిండిలా క‌లుపుకోవాలి. త‌రువాత పెనం మీద నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత టిష్యూ పేప‌ర్ తో తుడుచుకోవాలి. ఇప్పుడు పిండిని తీసుకుని దోశ లాగా వేసుకోవాలి. దోశ త‌డి ఆరిన త‌రువాత షెజ్వాన్ సాస్, గ‌రం మ‌సాలా, సాంబార్ మ‌సాలా పొడి వేసి దోశ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. త‌రువాత క్యారెట్ తురుము, కొత్తిమీర‌, ఉల్లిపాయ ముక్క‌లు చ‌ల్లుకోవాలి. దోశ పూర్తిగా కాలిన త‌రువాత నెమ్మ‌దిగా ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వల్ల ఎంతో రుచిగా ఉండే కారం దోశ త‌యార‌వుతుంది. దీనిని నేరుగా ఇలాగే తిన్నా లేదా చ‌ట్నీతో తిన్నా చాలా రుచిగా ఉంటుంది.

D

Recent Posts