Instant Malai Laddu : ఇన్ స్టాంట్ మలై లడ్డూ.. కొబ్బరి మిశ్రమం, పాలపొడితో చేసే ఈ లడ్డూలు చాలా రుచిగా ఉంటాయి. స్వీట్ షాపుల్లో లభించే మలై లడ్డూలకు ఏ మాత్రం తక్కువ కాకుండా చేసే ఈ ఇన్ స్టాంట్ మలై లడ్డూలు కూడా తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉంటాయి. పండగలకు, ఇంటికి అతిథులు వచ్చినప్పుడు, తీపి తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు వీటిని తయారు చేసి తీసుకోవచ్చు. తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉండే ఈ మలై లడ్డూలను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఇన్ స్టాంట్ మలై లడ్డూ తయారీకి కావల్సిన పదార్థాలు..
పచ్చికొబ్బరి ముక్కలు – ఒక కప్పు, బెల్లం తురుము – అర కప్పుచిన్నగా తరిగిన జీడిపప్పు – 4 లేదా 5, యాలకుల పొడి – పావు టీ స్పూన్, కాచిన పాలు – పావు కప్పు, పంచదార – 3 టేబుల్ స్పూన్స్, నెయ్యి – 2 టీ స్పూన్స్, పాల పొడి – ఒక కప్పు.
ఇన్ స్టాంట్ మలై లడ్డూ తయారీ విధానం..
ముందుగా జార్ లో పచ్చికొబ్బరి ముక్కలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని కళాయిలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో బెల్లం వేసి కలుపుతూ వేడి చేయాలి. బెల్లం కరిగిన తరువాత దీనిని మరో 2 లేదా 3 నిమిషాల పాటు దగ్గర పడే వరకు కలుపుతూ ఉడికించాలి. తరువాత జీడిపప్పు పలుకులు, యాలకుల పొడి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీనిని ఒక ప్లేట్ లోకి తీసుకుని కొద్దిగా చల్లారిన తరువాత చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. తరువాత మరో కళాయిలో పాలు, పంచదార, నెయ్యి, మరో పావు టీ స్పూన్ యాలకుల పొడి, పాలపొడి వేసి ఉండలు లేకుండా అంతా కలిసేలా చక్కగా కలుపుకోవాలి. తరువాత ఈ కళాయిని స్టవ్ మీద ఉంచి చిన్న మంటపై కలుపుతూ ఉడికించాలి.
ఈ మిశ్రమం కళాయికి అంటుకోకుండా ముద్దగా అయ్యే కలుపుతూ ఉడికించాలి. పాల పొడి మిశ్రమం ఉండలాగా అయిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. తరువాత ఈ మిశ్రమాన్ని చేత్తో బాగా వత్తుతూ మెత్తని ఉండలాగా చేసుకోవాలి. తరువాత కొద్దిగా ఈ మిశ్రమాన్ని తీసుకుని ఉండలాగా చేసుకున్న తరువాత వెడల్పుగా వత్తుకోవాలి. తరువాత దీని మధ్యలో కొబ్బరి ఉండను ఉంచి అంచులను మూసేసి గుండ్రటి ఉండలాగా చేసుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మలై లడ్డూలు తయారవుతాయి. వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఇలా మలై లడ్డూలను తయారు చేసి తీసుకోవడం వల్ల రుచితో పాటు ఆరోగ్యానికి కూడా హాని కలగకుండా ఉంటుంది.