Horse Gram For Nerves : మన శరీరంలో మెదడు నుండి సంకేతాలను అవయవాలకు చేరవేయడంలో అలాగే అవయవాల నుండి సంకేతాలను మెదడు చేరవేయడంలో నరాలు మనకు సహాయపడతాయి. మెదడు కణాలు, నరాల కణాలు రెండు అనుసందానంగా పని చేయడం వల్లనే మన శరీరంలో జీవక్రియలు సజావుగా సాగుతాయి. మెదడు, నరాల కణాలు కలిసి పనిచేయడం వల్లనే మనం అన్ని పనులను సక్రమంగా చేసుకోగలుగుతాము. మెదడు కణాలు, నరాల కణాలు ఒక్కసారి నశిస్తే మరలా తిరిగి బాగుకావు. మనం పుట్టినప్పుడు వృద్ది చెందిన కణాలే మన జీవిత కాలం ఉంటాయి. మరణించిన మెదడు కణాల స్థానంలో, నరాల కణాల స్థానంలో మరలా కొత్త కణాలు రావడం జరగదు. కనుక వీటిని మనం జీవితకాలం పాడవకుండా కాపాడుకోవాలి.
మెదడు కణాలు, నరాల కణాలు మనం జీవించినంత కాలం ఆరోగ్యంగా ఉండాలంటే ఉలవలను ఆహారంలో భాగంగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. మెదడు కణాలను, నరాల కణాలను డిటాక్సిఫికేషన్ చేయడంలో ఉలవలు మనకు ఎంతగానో సహాయపడతాయని నిపుణులు పరిశోధనల ద్వారా వెల్లడించారు. మెదడు కణాలపై, నరాల కణాలపై హానికలిగించే కొన్ని రకాల ప్రోటీన్స్ పేరుకుపోతాయి. ఇవి మెదడు కణాలను, నరాల కణాలను నెమ్మదిగా దెబ్బతీస్తూ ఉంటాయి. దీంతో కణాల పనితీరు దెబ్బతింటూ ఉంటుంది. ఇలాంటి హానికారక ప్రోటీన్ ను తొలగించి కణాల ఆరోగ్యాన్ని కాపాడడంలో ఉలవలు మనకు ఎంతో సహాయపడతాయి.
ఉలవల్లో ఇనులిన్ అనే ఫైబర్ ఉంటుంది. ఇవి మన ప్రేగుల్లోకి వెళ్లిన తరువాత మన ప్రేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియా ఈ ఫైబర్ ను పులియబెట్టి స్కీలో ఇనోసిటాల్ అనే రసాయనాన్ని తయారు చేస్తాయి. ఈ రసాయన సమ్మేళనం నరాల కణాలపై పేరుకుపోయిన హానికరమైన ప్రోటీన్ ను తొలగించి నరాల కణాలను, మెదడు కణాలను కాపాడుతుంది. అలాగే ఉలవలను తీసుకోవడం వల్ల రక్తంలో ఉండే గ్లూకోజ్ మెదడు కణాల్లోకి, నరాల కణాల్లోకి వెళ్లి కణాలు మరింత శక్తివంతంగా పని చేస్తాయి. అలాగే ఉలవలను తీసుకోవడం వల్ల ఇన్సులిన్ నిరోధకత తగ్గడంతో పాటు పాంక్రియాసిస్ గ్రంథిలో ఇన్సులిన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. అంతేకాకుండా ఉలవలు చాలా బలమైన ఆహారం. వీటిని తీసుకోవడం వల్ల కణాల్లో శక్తి ఎక్కువగా తయారవుతుంది.
100 గ్రాముల ఉలవల్లో 329 క్యాలరీల శక్తి ఉంటుంది. 22గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఈవిధంగా ఉలవలు మన ఆరోగ్యానికి, మెదడు కణాలకు, నరాల కణాలకు ఎంతో మేలు చేస్తాయని కనుక వీటిని కూడా తప్పకుండా ఆహారంలో భాగంగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఉలవలను ఉడికించి గుగ్గిళ్లుగా తయారు చేసి తీసుకోవచ్చు. అలాగే వీటిని మొలకెత్తించి కూడా తీసుకోవచ్చు. ఇలా ఏ విధంగా తీసుకున్నా కూడా ఉలవలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.