IPL 2022 : క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఐపీఎల్ సీజన్ వచ్చేసింది. శనివారం నుంచి ఐపీఎల్ 15వ ఎడిషన్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో చెన్నై, కోల్‌కతా జట్లు తలపడనున్నాయి. దీంతో వేసవి అంతా ఐపీఎల్ వినోదం ప్రేక్షకులను అలరించనుంది. ఇక కరోనా ప్రభావం ఉన్నప్పటికీ ఈసారి స్టేడియంలలో 25 శాతం ప్రేక్షకులను అనుమతిస్తున్నారు. దీంతో అభిమానులకు ఈ విషయం కాస్త ఊరటను కలిగిస్తుందని చెప్పవచ్చు. అయితే గత సీజన్‌లో జరిగిన కరోనా పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ఈ సారి పకడ్బందీగా బయో బబుల్ ను నిర్వహించనున్నారు. హద్దులు మీరినా, నిబంధనలను ఉల్లంఘించినా.. కఠినమైన చర్యలను తీసుకోనున్నారు. ఈ నియమాలు ప్లేయర్లకు, సిబ్బందికి అందరికీ వర్తిస్తాయి.
ఇక ఈ సారి ఐపీఎల్ విజేతకు ప్రైజ్ మనీ ఎంత ఇస్తారు ? అన్న విషయంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. 2019 సీజన్‌లో విజేతకు రూ.20 కోట్లు ఇచ్చారు. రన్నరప్‌కు రూ.12.50 కోట్లు వచ్చాయి. అలాగే 2020లోనూ ఈ విధంగానే ప్రైజ్ మనీని ఇచ్చారు. ఇక 2021లోనూ ఇదే విధానంలో ప్రైజ్ మనీలను ఇచ్చారు. కాగా క్వాలిఫైర్స్‌లో ఓడిన జట్లకు ఒక్కో దానికి రూ.4.30 కోట్ల చొప్పున ఇచ్చారు. అయితే ఈ సారి కూడా ఇదే విధంగా ఐపీఎల్ ప్రైజ్ మనీని ఇస్తారని తెలుస్తోంది. కాకపోతే 3వ స్థానంలో నిలిచిన జట్టుకు రూ.7 కోట్లు, 4వ స్థానంలో నిలిచిన జట్టుకు రూ.6.50 కోట్లు ఇస్తారని తెలుస్తోంది.
ఇక పర్పుల్ క్యాప్ విన్నర్‌కు రూ.15 లక్షలు, ఆరెంజ్ క్యాప్ విన్నర్‌కు రూ.15 లక్షలు, సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్ ప్లేయర్‌కు రూ.15 లక్షలు, క్రాట్ ఇట్ సిక్సెస్ ఆఫ్ ది సీజన్ ప్లేయర్‌కు రూ.12 లక్షలు, పవర్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ అవార్డుకు రూ.12 లక్షలు, మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్‌కు రూ.12 లక్షలు, గేమ్ చేంజర్ ఆఫ్ ది సీజన్ ప్లేయర్‌కు రూ.12 లక్షలు, ఎమర్జింగ్ ప్లేయర్‌కు రూ.20 లక్షలు ఇవ్వనున్నారు.