Viral Video : ప్రమాదాలు అనేవి చెప్పి జరగవు. అనుకోకుండానే జరుగుతాయి. అయితే కొన్ని ప్రమాదాలు మాత్రం కొన్ని సార్లు కొందరి నిర్లక్ష్యం వల్లనే జరుగుతుంటాయి. అలాంటి సమయాల్లో ఆ ప్రమాదాల బారిన పడి ప్రాణాలతో బయట పడడం కష్టమే. ఏదైనా అదృష్టం ఉంటే తప్ప ప్రాణాలతో బయట పడలేము. కానీ ఆ బాలుడికి చాలా అదృష్టం ఉందనే చెప్పవచ్చు. ఎంతో ఘోరమైన ప్రమాదం నుంచి వెంట్రుక వాసిలో తప్పించుకున్నాడు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
కేరళలోని కన్నూర్‌లో ఉన్న తాలిపరంబ అనే ప్రాంతంలోని చోరుక్కలలో ఓ 9 ఏళ్ల బాలుడు తన సైకిల్‌పై రహదారి మీదకు సడెన్‌గా వచ్చాడు. ఆ సైకిల్ సహాయంతో అతను రోడ్డు దాటేందుకు సడెన్‌గా ముందుకు వచ్చాడు. రోడ్డు మీద ఇరువైపులా వాహనాలు వస్తాయన్న విషయాన్ని అతను గమనించలేదు. వెంటనే రోడ్డు మీదకు సైకిల్‌పై వచ్చేశాడు. అయితే అదే సమయంలో రోడ్డు మీద వస్తున్న ఓ మోటార్ సైకిల్ ఆ బాలుడి సైకిల్‌ను వేగంగా ఢీకొంది. దీంతో ఆ బాలుడు సైకిల్ మీద నుంచి రోడ్డు అవతలి వైపుకు పడిపోయాడు.
ఇక ఆ సమయంలో సైకిల్ రోడ్డు మీద పడిపోగా.. వెంటనే అదే దారిలో కేరళ రాష్ట్ర ఆర్‌టీసీ బస్సు వచ్చింది. ఆ సైకిల్ మీద నుంచి ఆ బస్సు వెళ్లింది. దీంతో సైకిల్ నుజ్జు నుజ్జు అయింది. కానీ బాలుడు రోడ్డుకు అవతలి వైపుకు ఎగిరిపడ్డాడు. సైకిల్ వద్ద లేడు. దీంతో ఘోర ప్రమాదం తప్పింది. అంతా క్షణాల్లోనే జరిగిపోయింది. ఒక్క నిమిషం పాటు అక్కడ ఏం జరుగుతుందో కూడా ఎవరికీ తెలియలేదు. ముందుగా బాలుడు, తరువాత మోటార్ సైకిల్, తరువాత బస్సు.. ఇలా ఒకదాని వెనుక ఒకటి సంఘటనలు వెంట వెంటనే జరిగిపోయాయి. కానీ అదృష్టం బాగా ఉండడం చేత ఆ బాలుడు బతికిపోయాడు. లేదంటే ఘోర ప్రమాదం జరిగి ఉండేది. బస్సు చక్రాల కింద అతను నలిగిపోయి ఉండేవాడు. ఈ క్రమంలోనే అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాల్లో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. దీంతో ఆ వీడియో వైరల్‌గా మారింది. అందరూ ఆ బాలుడికి చాలా లక్ ఉందని, అందుకనే అతను బతికిపోయాడని.. కామెంట్లు చేస్తున్నారు.