Jeedi Pappu Pakodi : మనం జీడిపప్పును కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. జీడిపప్పును తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందన్న సంగతి మనకు తెలిసిందే. వీటిని నానబెట్టి తీసుకోవడంతో పాటు ఈ జీడిపప్పుతో వివిధ రకాల చిరుతిళ్లను కూడా తయారు చేస్తూ ఉంటాము. జీడిపప్పుతో చేసే రుచికరమైన చిరుతిళ్లల్లో జీడిపప్పు పకోడి కూడా ఒకటి. జీడిపప్పు చాలా రుచిగా ఉంటుంది. ఇది ఎక్కువగా స్వీట్ షాపుల్లో లభిస్తూ ఉంటుంది. జీడిపప్పు పకోడిని బయట కొనుగోలు చేసే అవసరం లేకుండా మనం ఇంట్లోనే తయారు చేసుకుని తినవచ్చు. ఈ పకోడిని తయారు చేయడం చాలా తేలిక. నిమిషాల వ్యవధిలోనే ఈ పకోడీలను మనం తయారు చేసుకోవచ్చు. క్రిస్పీగా, రుచిగా జీడిపప్పు పకోడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
జీడిపప్పు పకోడి తయారీకి కావల్సిన పదార్థాలు..
జీడిపనప్పు – ఒక కప్పు, శనగపిండి – పావు కప్పు, బియ్యం పిండి – 2 టేబుల్ స్పూన్స్, పసుపు – పావు టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, తరిగిన ఉల్లిపాయ – 1, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, చిన్నగా తరిగిన కొత్తిమీర – కొద్దిగా, చిన్నగా తరిగిన కరివేపాకు – ఒక రెమ్మ, అల్లం వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్, చాట్ మసాలా – అర టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
జీడిపప్పు పకోడి తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో జీడిపప్పును తీసుకోవాలి. తరువాత ఇందులో నూనె తప్పమిగిలిన పదార్థాలు వేసి కలపాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి కలుపుకోవాలి. జీడిపప్పు పకోడికి సాధౄరణ పకోడి కంటే పిండి గట్టిగా ఉండేలా చూసుకోవాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక జీడిపప్పును తీసుకుంటూ పకోడీలా వేసుకోవాలి. తరువాత వీటిని మధ్యస్థ మంటపై ఎర్రగా అయ్యే వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల జీడిపప్పు పకోడి తయారవుతుంది. ఎప్పుడైనా స్నాక్స్ గా తినడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. ఒక్కటి కూడా విడిచిపెట్టకుండా వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.