Jeera Aloo : ఆలూ జీరా… బంగాళాదుంపలతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో ఇది కూడా ఒకటి. మనకు ఎక్కువగా ధాబాలల్లో ఇది లభిస్తూ ఉంటుంది. ఆలూ జీరా చాలా రుచిగా ఉంటుంది. అన్నంతో తినడానికి, చపాతీ వంటి వాటితో తినడానికి అలాగే పప్పు వంటి వాటితో సైడ్ డిష్ గా తినడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. ఆలూ జీరాను తయారు చేసుకోవడం చాలా సులభం. 10 నిమిషాల్లోనే దీనిని తయారు చేసుకోవచ్చు. అలాగే ఎవరైనా చాలా సులభంగా దీనిని తయారు చేసుకోవచ్చు. తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉండే ఈ ఆలూ జీరాను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఆలూ జీరా తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 2 టేబుల్ స్పూన్స్, తరిగిన వెల్లుల్లి రెమ్మలు – 4, తరిగిన అల్లం – ఒక ఇంచు ముక్క, జీలకర్ర – ఒక టీ స్పూన్, ఎండుమిర్చి – 2, కరివేపాకు – ఒక రెమ్మ, తరిగిన పచ్చిమిర్చి – 3, పుదీనా ఆకులు – 15, పసుపు – పావు టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, కసూరిమెంతి – అర టీ స్పూన్, గరం మసాలా – అర టీ స్పూన్, ఆమ్ చూర్ పొడి – అర టీ స్పూన్, ఉడికించిన ముక్కలుగా చేసిన బంగాళాదుంపలు – 300 గ్రా., ఉప్పు – తగినంత, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
ఆలూ జీరా తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక వెల్లుల్లి, అల్లం ముక్కలు వేసి వేయించాలి. తరువాత జీలకర్ర వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, పుదీనా వేసి వేయించాలి. తరువాత పసుపు, ధనియాల పొడి, కారం, కసూరిమెంతి, గరం మసాలా, ఆమ్ చూర్ పొడి వేసి వేయించాలి. తరువాత ఉడికించిన బంగాళాదుంప ముక్కలు, ఉప్పు వేసి కలపాలి. వీటిని మరో 2 నిమిషాల పాటు కలుపుతూ వేయించిన తరువాత కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ జీరా తయారవుతుంది. దీనిని చపాతీ, రోటీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన ఆలూ జీరాను అందరూ ఇష్టంగా తింటారు.