Tea With Biscuits : రోజూ టీ తాగే అలవాటు మనలో చాలా మందికి ఉంది. రోజూ ఉదయం, సాయంత్రం సమయాల్లో టీ తాగుతూ ఉంటారు. అలాగే టీతో పాటు బిస్కెట్స్, బన్ వంటి వాటితో పాటు పకోడి లాంటి స్నాక్స్ ను కూడా తీసుకుంటూ ఉంటారు. అయితే టీ తో పాటు మనం తీసుకునే కొన్ని చిరుతిళ్లు మన ఆరోగ్యానికి ఎంతో హానిని కలిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అసలు టీ తో పాటు తీసుకోకూడని ఆహార పదార్థాలు ఏమిటి.. వీటిని తీసుకోవడం వల్ల మనకు కలిగే నష్టం ఏమిటి…. అలాగే టీ తో తీసుకోదగిన ఆహార పదార్థాలు ఏమిటి… అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. టీతో పాటుగా డీప్ ఫ్రై చేసిన ఆహారాలను, చాలా స్పైసీగా ఉండే ఆహారాలను తీసుకోకూడదు. ఇవి ప్రేగులల్లో ఆమ్లత్వాన్ని పెంచుతాయి. టీతో పాటుగా కేక్స్, డోనట్స్, పేస్ట్రీ వంటి వాటిని కూడా తీసుకోకూడదు.
ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచుతాయి. దీంతో శక్తి స్థాయిలల్లో మార్పులు వచ్చి అలసటకు గురి అయ్యే అవకాశం ఉంది. అలాగే టీతో పాటుగా ఉప్పు కలిగిన బంగాళాదుంప చిప్స్, సాల్టెడ్ గింజలు వంటి వాటిని కూడా తీసుకోకూడదు. వీటిని తీసుకోవడం వల్ల ఉబ్బరంతో పాటుగా రక్తపోటు కూడా పెరిగే అవకాశం ఉంది. టీతో పాటుగా మసాలా ఉన్న ఆహారాలను కూడా తీసుకోకూడదు. వీటి వల్ల గుండెలో మంట, జీర్ణ సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. టీతో పాటుగా నిమ్మజాతికి చెందిన పండ్లను కూడా తీసుకోకూడదు. టీని, నిమ్మజాతికి చెందిన పండ్లను తీసుకోవడం వల్ల పొట్టలో ఆమ్లత్వం పెరుగుతుంది. యాసిడ్ రిప్లెక్షన్ మరింత ఎక్కువ అవుతుంది. అదేవిధంగా టీతో పాటుగా మాంసాన్ని కూడా తీసుకోకూడదు. మాంసంలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది.
దీంతో జీర్ణ సమస్యలతో పాటు పొట్టలో అసౌకర్యానికి దారి తీస్తుంది. టీతో పాటుగా చీజ్ కేక్, ఐస్ క్రీం, క్రీమ్ ఎక్కువగా ఉండే కేక్స్, బిస్కెట్లు వంటి వాటిని కూడా తీసుకోకూడదు. వీటిలో కొవ్వు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. దీంతో జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. టీతో పాటుగా ప్రాసెస్డ్ చేసిన ఆహారాలను, ప్రిజర్వేటివ్స్ ఉండే ఆహారాలను కూడా తీసుకోకూడదు. ఇది కడుపులో మంట, అజీర్తి సమస్యలకు దారి తీస్తుంది. అలాగే ఫ్రెంచ్ ఫ్రైస్, ప్రైడ్ చికెన్ వంటి వాటిని కూడా టీతో పాటు తీసుకోకూడదు. ఇవి అధిక కొవ్వులు కలిగి ఉంటాయి. దీంతో జీర్ఱ సమస్యలు తలెత్తుతాయి. వీటికి బదులుగా టీతో పాటు సమతుల్య ఆహారం మరియు సంతృప్తిని ఇచ్చే ఆహారాలను తీసుకోవాలి. పండ్లు, గింజలు, తృణ ధాన్యాలతో చేసిన క్రాకర్స్ వంటి తేలికగా జీర్ణమయ్యే ఆహారాలను తీసుకోవాలి.