Jonna Dibba Rotte : మన ఆరోగ్యానికి మేలు చేసే జొన్నలతో మనం రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాము. జొన్నలతో చేసే వంటకాలను తినడం వల్ల రుచితో పాటు మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. జొన్నలతో చేసుకోదగిన ఆరోగ్యకరమైన వంటకాల్లో జొన్న దిబ్బ రొట్టెలు కూడా ఒకటి. జొన్న రవ్వతో చేసే ఈ దిబ్బ రొట్టెలు క్రిస్పీగా చాలా రుచిగా ఉంటాయి. వీటిని తయారు చేయడం కూడా చాలా తేలిక. ఈ దిబ్బ రొట్టెలను తినడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. జొన్నరవ్వతో దిబ్బ రొట్టెలను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
జొన్న దిబ్బ రొట్టె తయారీకి కావల్సిన పదార్థాలు..
మినపప్పు – ఒక కప్పు, జొన్న రవ్వ – 3 కప్పులు, ఉప్పు – తగినంత.
జొన్న దిబ్బ రొట్టె తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో మినపప్పును తీసుకుని శుభ్రంగా కడగాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి 3 గంటల పాటు నానబెట్టుకోవాలి. తరువాత మరో గిన్నెలో జొన్న రవ్వను తీసుకుని శుభ్రంగా కడగాలి. తరువాత ఈ రవ్వను కూడా 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. తరువాత పప్పును జార్ లో లేదా గ్రైండర్ లో వేసి తగినన్ని నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత జొన్న రవ్వను నీళ్లన్నీ పోయేలా చేత్తో పిండుతూ పిండిలో వేసి కలుపుకోవాలి. తరువాత దీనిపై మూత పెట్టి రాత్రంతా పులియబెట్టాలి. పిండి పులిసిన తరువాత ఇందులో ఉప్పు వేసి కలపాలి. తరువాత స్టవ్ మీద కళాయిని లేదా పెన్నాన్ని ఉంచి దానిపై నూనె వేసి వేడి చేయాలి.
నూనె వేడయ్యాక రెండు లేదా మూడు గంటెల పిండిని వేసి దిబ్బ రొట్టెలాగా వేసుకోవాలి. దీనిని మధ్యస్థ మంటపై క్రిస్పీగా అయ్యే వరకు కాల్చుకున్న తరువాత మరో వైపుకు తిప్పుకోవాలి. దీనిని మరో రెండు నిమిషాల పాటు కాల్చుకున్న తరువాత ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. ఏ చట్నీతో తిన్నా కూడా ఈ దిబ్బ రొట్టెలు చాలా రుచిగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారు, షుగర్ వ్యాధితో బాధపడే వారు వీటిని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.