Jonna Dosa : మనం జొన్నలను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. జొన్నలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగతి మనకు తెలిసిందే. బరువు తగ్గడంలో, జీర్ణశక్తిని మెరుగుపరచడంలో, శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఇలా అనేక రకాలుగా జొన్నలు మనకు సహాయపడతాయి. జొన్నలతో రకరకాల ఆహార పదార్థాలను తయారు చేసుకుని తీసుకుంటూ ఉంటాము. జొన్నలతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో జొన్న దోశ కూడా ఒకటి. జొన్న దోశ చాలా రుచిగా ఉంటుంది. అల్పాహారంగా తీసుకోవడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ జొన్నలతో దోశలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
జొన్న దోశ తయారీకి కావల్సిన పదార్థాలు..
జొన్నలు – 3 కప్పులు, మినపప్పు – ఒక కప్పు, మెంతులు – ఒక టీ స్పూన్, అటుకులు – అర కప్పు, ఉప్పు – తగినంత.
జొన్న దోశ తయారీ విధానం..
ముందుగా జొన్నలను శుభ్రపరుచుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో మెంతులు, మినపప్పు వేసి శుభ్రంగా కడగాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి 8 నుండి 10 గంటల పాటు నానబెట్టుకోవాలి. పిండి పట్టడానికి పది నిమిషాల ముందు ఒక గిన్నెలో అటుకులను తీసుకుని నీళ్లు పోసి నానబెట్టాలి. ఇలా నానబెట్టిన తరువాత ఒక జార్ లో అటుకులను తీసుకోవాలి. అదే జార్ లో నానబెట్టుకున్న జొన్నలను కూడా తీసుకుని కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. జొన్నలు మెత్తగా అవ్వడానికి సమయం ఎక్కువగా పడుతుంది. కనుక జార్ లో కొద్ది కొద్దిగా జొన్నలను మాత్రమే తీసుకోవాలి. ఇలా పిండిని పట్టుకున్న తరువాత అంతా కలిసేలా కలుపుకుని రాత్రంతా పులియబెట్టుకోవాలి.
పిండి పులిసిన తరువాత తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. తరువాత స్టవ్ మీద పెన్నాన్ని ఉంచి వేడి చేయాలి. పెనం వేడయ్యాక తగినంత పిండిని తీసుకుని దోశలాగా వేసుకోవాలి. తరువాత నూనె వేసి ఈ దోశను రెండు వైపులా కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే జొన్న దోశ తయారవుతుంది. దీనిని చట్నీతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇదే పిండితో మనం ఉల్లిదోశ, కారం దోశను కూడా తయారు చేసుకోవచ్చు. బరువు తగ్గాలనుకునే వారు, షుగర్ వ్యాధితో బాధపడే వారు ఈ విధంగా జొన్నలతో దోశలను తయారు చేసుకుని తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.