Jowar Idli : జొన్నలు.. మనం ఆహారంగా తీసుకునే చిరు ధాన్యాల్లో ఇవి కూడా ఒకటి. జొన్నలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఎముకలను ధృడంగా ఉండచంలో, రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో, శరీరానికి కావల్సిన పోషకాలను అందించడంలో, బరువు తగ్గేలా చేయడంలో ఇలా అనేక రకాలుగా జొన్నలు మనకు సహాయపడతాయి. జొన్నలతో సంగటి, రొట్టె వంటి వాటితో పాటు మనం ఇడ్లీలను కూడా తయారు చేసుకోవచ్చు. జొన్న ఇడ్లీలను తయారు చేయడం కూడా చాలా సులభం. ఆరోగ్యానికి మేలు చేసే జొన్నలతో ఇడ్లీలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
జొన్న ఇడ్లీ తయారీకి కావల్సిన పదార్థాలు..
జొన్నలు – కిలో, మినపప్పు- ఒక కప్పు, ఉప్పు – తగినంత.
జొన్న ఇడ్లీ తయారీ విధానం..
ముందుగా జొన్నలను శుభ్రంగా కడిగి ఎండబెట్టాలి. తరువాత వీటిని జార్ లో వేసి ఇడ్లీ రవ్వలా మిక్సీ పట్టుకోవాలి. తరువాత రవ్వను పిండి జల్లెడలో వేసి పిండిని అలాగే జొన్న రవ్వను వేరు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న రవ్వను రెండు కప్పుల మోతాదులో తీసుకుని మిగిలిన రవ్వను నిల్వ చేసుకోవాలి. ఇప్పుడు మినపప్పును కూడా శుభ్రంగా కడిగి 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. తరువాత జార్ లో పప్పును తీసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. పిండి కొద్దిగా పలుచగా ఉండేలా చూసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పిండిలో ఉప్పు, జొన్న రవ్వ వేసి కలపాలి. తరువాత దీనిపై మూత పెట్టి 3 గంటల పాటు పులియబెట్టాలి.
పిండి పులిసిన తరువాత మరీ గట్టిగా ఉంటే కొద్దిగా నీళ్లు పోసి కలుపుకోవాలి. తరువాత ఈ పిండిని ఇడ్లీ ప్లేట్ లలోకి తీసుకోవాలి. తరువాత ఈ ప్లేట్ లను కుక్కర్ లో ఉంచి 15 నిమిషాల పాటు మధ్యస్థ మంటపై ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఈ ఇడ్లీలను బయటకు తీసి 2 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తరువాత ప్లేట్ నుండి తీసి సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా జొన్న ఇడ్లీలు తయారవుతాయి. ఈ ఇడ్లీలను చట్నీతో తింటే మరింత రుచిగా ఉంటాయి. వీటిని తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.