Kadapa Style Theepi Undalu : తీపి ఉండలు.. గోధుమపిండితో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో ఇవి కూడా ఒకటి. ఈ తీపి ఉండలను ఎక్కువగా రాయలసీమ ప్రాంతంలో తయారు చేస్తారు. గోధుమపిండి, బెల్లంతో చేసే ఈ తీపి ఉండలను తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి హాని కలగకుండా ఉంటుంది. తీపి తినాలనిపించినప్పుడు లేదా పండగలకు వీటిని అప్పటికప్పుడు తయారు చేసి తీసుకోవచ్చు. ఈ ఉండలను తయారు చేసుకోవడానికి ఎక్కువగా సమయం కూడా పట్టదు. చాలా తక్కువ సమయంలో చాలా సులభంగా వీటిని తయారు చేసుకోవచ్చు. తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉండే కడప స్టైల్ తీపి ఉండలను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
తీపి ఉండల తయారీకి కావల్సిన పదార్థాలు..
గోధుమపిండి – ఒక కప్పు, ఎండుకొబ్బరిపొడి – పావు కప్పు, యాలకుల పొడి – ఒక టీ స్పూన్, పంచదార – 2 టీ స్పూన్స్, ఉప్పు – చిటికెడు, వంటసోడా – పావు టీ స్పూన్, బెల్లం తురుము – అర కప్పు, కాచి చల్లార్చిన పాలు – పావు కప్పు, ఉప్మా రవ్వ – 2 టేబుల్ స్పూన్స్, నూనె – డీప్ ప్రైకు సరిపడా.
తీపి ఉండల తయారీ విధానం..
ముందుగా గిన్నెలో గోధుమపిండిని తీసుకోవాలి. తరువాత ఎండుకొబ్బరి పొడి, యాలకుల పొడి, పంచదార, ఉప్పు, వంటసోడా వేసి కలపాలి. తరువాత బెల్లం తురుము వేసి కలపాలి. తరువాత పాలు పోసి కలపాలి. తరువాత కొద్ది కొద్దిగా నీటిని పోసుకుంటూ బోండా పిండి లాగా కలుపుకోవాలి. తరువాత రవ్వ వేసి కలపాలి. ఈ పిండిలో బెల్లం ఉండలు లేకుండా అంతా కలిసేలా చక్కగా కలుపుకున్న తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక పిండిని తీసుకుని కావల్సిన పరిమాణంలో ఉండలుగా వేసుకోవాలి. వీటిని మధ్యస్థ మంటపై అటూ ఇటూ తిప్పుతూ ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే తీపి ఉండలు తయారవుతాయి. వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. అలాగే ఈ ఉండలు నిల్వ కూడా ఉంటాయి.