Kaju Katli : మనకు స్వీట్ షాపుల్లో లభించే తీపి వంటకాల్లో కాజు కత్లి కూడా ఒకటి. ఈ కాజు కత్లి నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత రుచిగా మెత్తగా ఉంటుంది. జీడిపప్పుతో చేసే ఈ వంటకాన్ని ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. ఈ కాజు కత్లిని అదే రుచితో మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం చాలా తేలిక. తిన్నా కొద్ది తిన్నాలనిపించేంత రుచిగా ఉండే ఈ కాజు కత్లిని ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
స్వీట్ షాప్ స్టైల్ కాజు కత్లి తయారీకి కావల్సిన పదార్థాలు..
జీడిపప్పు – 250 గ్రా., పాలు – పావు కప్పు, పంచదార – 200 గ్రా., యాలకుల పొడి – అర టీ స్పూన్, నెయ్యి – 2 టీ స్పూన్స్.
స్వీట్ షాప్ స్టైల్ కాజు కత్లి తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో జీడిపప్పును తీసుకోవాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి. తరువాత జీడిపప్పును వడకట్టి పూర్తిగా నీళ్లు పోయిన తరువాత జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే పాలను పోసి వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత అడుగు మందంగా ఉండే కళాయిలో పంచదార, మిక్సీ పట్టుకున్న కాజు మిశ్రమం వేసి పంచదార కరిగే వరకు కలుపుతూ చిన్న మంటపై వేడి చేయాలి. పంచదార కరిగి జీడిపప్పు మిశ్రమం కళాయికి అంటుకోకుండా ముద్దగా అయ్యే వరకు అడుగు మాడిపోకుండా కలుపుతూ ఉండాలి. ఇలా ఉడికించిన తరువాత జీడిపప్పు మిశ్రమాన్ని కొద్దిగా తీసుకుని ఉండలా చుట్టి చూడాలి. ఈ మిశ్రమం ఉండ చేయడానికి రాగానే స్టవ్ ఆఫ్ చేసి యాలకుల పొడి, నెయ్యి వేసి కలపాలి. తరువాత గంటెతో జీడిపప్పు మిశ్రమాన్ని కళాయి అంచులకు రాసి చల్లారే వరకు ఉంచాలి.
ఇలా చల్లారిన తరువాత చేత్తో బాగా కలపాలి. తరువాత ప్లేట్ కు నెయ్యి రాసి జీడిపప్పు మిశ్రమాన్ని దానిపై వేసి చపాతీ కర్రతో అంతా సమానంగా వచ్చేలా రుద్దుకోవాలి. తరువాత దీనిని 12 గంటల పాటు అలాగే ఉంచాలి. 12 గంటల తరువాత ఈ జీడిపప్పు మిశ్రమాన్ని కావాల్సిన ఆకారంలో ముక్కలుగా చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కాజు కత్లి తయారవుతుంది. ఈ విధంగా తయారు చేసిన కాజు కత్లి రెండు నుండి మూడు రోజులు అయిన విరిగి పోకుండా పొడి పొడిగా కాకుండా అలాగే ఉంటుంది. బయట స్వీట్ షాపుల్లో అధిక ధరలకు కొనుగోలు చేసే పని లేకుండా ఇలా కాజు కత్లిని మనం ఇంట్లోనే తయారు చేసుకుని తినవచ్చు. జీడిపప్పుతో చేసే ఈ తీపి వంటకాన్ని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.