Sunnundalu : మనం మినుములను కూడా ఆహారంగా తీసుకుంటాం. మినుములు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల ఎముకల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. గుండె సంబంధిత సమస్యలు మన దరి చేరకుండా ఉంటాయి. ఎముకలు బలంగా తయారవుతాయి. శరీరానికి శక్తిని ఇవ్వడంలో, రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో కూడా మినుములు మనకు ఎంతగానో దోహదపడతాయి. మినుములతో చేసుకోదగిన తీపి వంటకాలు అనగానే ముందుగా అందరికి గుర్తుకు వచ్చేవి సున్నుండలు. వీటిని మనలో చాలా మంది రుచి చూసే ఉంటారు. ఈ సున్నుండలను తయారు చేయడం కూడా చాలా తేలిక. రుచిగా, ఆరోగ్యానికి మేలు చేసేలా ఈ సున్నండలను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
సున్నుండల తయారీకి కావల్సిన పదార్థాలు..
పొట్టు మినుములు – అర కిలో, బియ్యం – 2 టీ స్పూన్స్, బెల్లం తురుము – అర కిలో, యాలకుల పొడి – ఒక టీ స్పూన్, వేడి నెయ్యి – 100 గ్రా..
సున్నుండల తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో పొట్టు మినుములు వేసి మధ్యస్థ మంటపై వేయించాలి. వీటిని కలుపుతూ దోరగా వేయించిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారే వరకు ఉంచాలి. పూర్తిగా చల్లారిన తరువాత వీటిని ఒక జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే బియ్యం వేసి కొద్దిగా బరకగా ఉండేలా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో బెల్లం తురుము వేసి బాగా కలపాలి. తరువాత వేడి వేడిగా ఉన్న నెయ్యి వేసి కలపాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా మినపప్పు మిశ్రమాన్ని తీసుకుంటూ గట్టిగా వత్తుకుంటూ ఉండలుగా చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే సున్నుండలు తయారవుతాయి. వీటిని గాలి తగలకుండా నిల్వ చేసుకోవాలి. ఈ సున్నండలను రోజుకు ఒకటి లేదా రెండు చొప్పున తినడం వల్ల మనం రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు. తీపి తినాలనిపించినప్పుడు లేదా పండుగలకు ఈ విధంగా సున్నండలను తయారు చేసుకుని తినవచ్చు.