Kakarakaya Karam Fry : కాకరకాయలు.. చేదుగా ఉన్నప్పటికి వీటిని కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. కాకరకాయలను తినడం వల్ల మనం రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు. ఈ కాకరకాయలతో మనం కూర, పులుసు, వేపుడు , కారం వంటి వాటిని ఎక్కువగా తయారు చేస్తూ ఉంటాం. కాకరకాయలతో చేసే కారం చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది కాకరకాయ కారాన్ని ఇష్టంగా తింటారు. ఈ కాకరకాయ కారాన్ని మనం మరింత రుచిగా , భిన్నంగా కూడా తయారు చేసుకోవచ్చు. కాకరకాయ కారాన్ని మరింత రుచిగా, భిన్నంగా ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కాకరకాయ కారం తయారీకి కావల్సిన పదార్థాలు..
కాకరకాయలు – పావుకిలో, కారం – 3 టేబుల్ స్పూన్స్, ఎండుకొబ్బరి – 10 గ్రా., వెల్లుల్లి రెబ్బలు – 8, ఉప్పు – తగినంత, నూనె – 2 టేబుల్ స్పూన్స్.
కాకరకాయ కారం తయారీ విధానం..
ముందుగా కాకరకాయలపై ఉండే చెక్కును తీసేసి శుభ్రంగా కడగాలి. తరువాత కాకరకాయలకు నిలువుగా గాట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు జార్ లో ఎండు కొబ్బరి ముక్కలు, ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు, కారం వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక కాకరకాయలను వేసి వేయించాలి. వీటిని ఎర్రగా అయ్యే వరకు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే నూనెలో మిక్సీ పట్టుకున్న కారం వేసి వేయించాలి. దీనిని మూడు నిమిషాల పాటు వేయించిన తరువాత వేయించిన కాకరకాయలను కూడా వేసి కలపాలి. వీటిని రెండు నిమిషాల పాటు కలుపుతూ వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కాకరకాయ కారం తయారవుతుంది. దీనిని అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ కారం వారం రోజుల పాటు తాజాగా ఉంటుంది. కాకరకాయలతో చేసే ఈ కారాన్ని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. కాకరకాయలతో తరచూ చేసే వంటకాలతో పాటు అప్పుడప్పుడూ ఇలా కూడా తయారు చేసుకుని తినవచ్చు.