Kakarakaya Karam Podi : మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కూరగాయల్లో కాకరకాయ కూడా ఒకటి. కాకరకాయలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. దీనిని తినడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందించే ఈ కాకరకాయలతో మనం రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. చేదుగా ఉన్నప్పటికి కాకరకాయతో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. కాకరకాయలతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో కాకరకాయ కారం పొడి కూడా ఒకటి. కాకరకాయలతో చేసే ఈ కారం పొడి చాలా రుచిగా ఉంటుంది. ఏ కూర లేనప్పటికి ఈ కారం పొడితో అన్నం తింటే కడుపు నిండిన భావన కలుగుతుంది. ఎంతో కమ్మగా, రుచిగా ఉండే ఈ కాకరకాయ కారం పొడిని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కాకరకాయ కారం పొడి తయారీకి కావల్సిన పదార్థాలు..
కాకరకాయలు – అరకిలో, ఉప్పు – తగినంత, శనగపప్పు – 2 టేబుల్ స్పూన్స్, మినపప్పు – 2 టేబుల్ స్పూన్స్, ధనియాలు – 2 టేబుల్ స్పూన్స్, జీలకర్ర – ఒక టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు – 7, చింతపండు – చిన్న నిమ్మకాయంత, నువ్వులు – ఒక టీ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ, ఎండుమిర్చి – 10 నుండి 15, నూనె – పావు కప్పు, బెల్లం పొడి – ఒక టీ స్పూన్.
కాకరకాయ కారం పొడి తయారీ విధానం..
ముందుగా కాకరకాయ తొడిమలను తీసేసి చిన్న రంధ్రాలు ఉన్న గ్రేటర్ తో తురుముకోవాలి. తరువాత ఈ తురుములో ఉప్పు వేసి కలిపి పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో ఒక టీ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక శనగపప్పు వేసి చిన్న మంటపై వేడి చేయాలి. శనగపప్పు సగం వేగిన తరువాత మినపప్పు వేసి ఎర్రగా అయ్యే వరకు వేయించాలి. తరువాత ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు వేసి వేయించాలి. ఇవి కూడా చక్కగా వేగిన తరువాత నువ్వులు, కరివేపాకు వేసి వేయించాలి. కరివేపాకును కరకరలాడే వరకు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో మరో టీ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఎండుమిర్చి వేసి వేయించాలి. వీటిని కూడా చక్కగా వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో నూనె వేసి వేడి చేయాలి.
నూనె వేడయ్యాక కాకరకాయ తురుములో ఉండే నీటిని తీసేసి కాకరకాయ తురుమును వేసుకుని వేయించాలి. దీనిని ఎర్రగా, కరకరలాడే వరకు వేయించుకున్న తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు జార్ లో వేయించుకున్న ఎండుమిర్చి, మసాలా దినుసులు, ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఇందులో వేయించిన కాకరకాయ తురుము, బెల్లం పొడి వేసి మరోసారి మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కాకరకాయ కారం పొడి తయారవుతుంది. దీనిని వేడి వేడి అన్నం, నెయ్యితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. కాకరకాయతో తరచూ చేసే వంటకాలతో పాటు అప్పుడప్పుడూ ఇలా కారం పొడిని కూడా తయారు చేసుకుని తినవచ్చు.