Kakarakaya Masala Kura : కాకరకాయలతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో కాకరకాయ మసాలా కూర కూడా ఒకటి. ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. కాకరకాయలను తినని వారు కూడా ఈ కూరను ఇష్టంగా తింటారని చెప్పవచ్చు. అస్సలు చేదు లేకుండా చేసే ఈ కాకరకాయ మసాలా కూరను అందరు ఇష్టపడతారని చెప్పవచ్చు. ఈ కూరను తయారు చేయడం చాలా తేలిక. ఎవరైనా చాలా సులభంగా ఈ కూరను తయారు చేసుకోవచ్చు. చేదు లేకుండా రుచిగా అందరికి నచ్చేలా కాకరకాయ మసాలా కూరను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కాకరకాయ మసాలా కూర తయారీకి కావల్సిన పదార్థాలు..
కాకరకాయలు – పావుకిలో, నూనె – 3 టేబుల్ స్పూన్స్, ఆవాలు – ఒక టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, తరిగిన పచ్చిమిర్చి – 2, చిన్నగా తరిగిన పెద్ద ఉల్లిపాయ – 1, సన్నగా తరిగిన పెద్ద టమాట – 1, కారం – ఒకటిన్నర టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత, బెల్లం తురుము – ఒక టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
మసాలా పేస్ట్ తయారీకి కావల్సిన పదార్థాలు..
పల్లీలు – 2 టేబుల్ స్పూన్స్, ఎండుకొబ్బరి ముక్కలు – ఒక టేబుల్ స్పూన్, ధనియాలు – ఒక టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, నువ్వులు – ఒక టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు – 5, చింతపండు – చిన్న నిమ్మకాయంత.
కాకరకాయ మసాలా కూర తయారీ విధానం..
ముందుగా కాకరకాయలపైఉండే చెక్కును తీసేసి గుండ్రటి ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత వీటి లోపల ఉండే గింజలను తీసేసి గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత వీటిపై ఉప్పు, పసుపు వేసి కలపాలి. వీటిని 20 నిమిషాల పాటు అలాగే ఉంచిన తరువాత నీటిని పిండేసి ముక్కలను గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత కళాయిలో మసాలా పేస్ట్ కోసం పల్లీలు వేసి వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన తరువాత ఎండు కొబ్బరి ముక్కలు, ధనియాలు, జీలకర్ర వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత నువ్వులు వేసి వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత వీటిని జార్ లోకి తీసుకుని అందులోనే వెల్లుల్లి రెబ్బలు, చింతపండు వేసి, తగినన్ని నీళ్లు పోసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక కాకరకాయ ముక్కలు వేసి ఎర్రగా అయ్యే వరకు వేయించి గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత అదే నూనెలో ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి.
తరువాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా వేగిన తరువాత టమాట ముక్కలు, ఉప్పు, పసుపు, కారం వేసి కలపాలి. వీటిపై మూత పెట్టి టమాట ముక్కలు మెత్తగా అయ్యే వరకు వేయించాలి. తరువాత కాకరకాయ ముక్కలు వేసి 2 నిమిషాల పాటు వేయించాలి. తరువాత మిక్సీ పట్టుకున్న పేస్ట్, నీళ్లు పోసి కలపాలి. ఇప్పుడు వీటిపై మూత పెట్టి నూనె పైకి తేలే వరకు ఉడికించాలి. చివరగా కొత్తిమీరను చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కాకరకాయ మసాలా కూర తయారవుతుంది. ఈ విధంగా తయారు చేసిన కాకరకాయ కూరను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. అన్నంతో తింటే ఈ కూర మరింత రుచిగా ఉంటుంది.