Saptaparni Tree : మన చుట్టూ ప్రకృతిలో ఎన్నో రకాల చెట్లు ఉన్నాయి. వాటిల్లో చాలా వరకు చెట్లు ఆయుర్వేద పరంగా ఎన్నో ప్రయోజనాలను అందించేవే. కానీ వాటి గురించి చాలా మందికి తెలియదు. అలాంటి చెట్లలో సప్తపర్ణి చెట్టు కూడా ఒకటి. ఇది చూసేందుకు అలంకరణ చెట్టులా ఉంటుంది. కానీ ఇందులో అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయి. సప్తపర్ణి చెట్టును ఏడాకుల చెట్టు అని కూడా పిలుస్తారు. దీని కొమ్మల దగ్గర ఏడు ఆకులు గుంపుగా ఉంటాయి. అందుకనే దీన్ని ఏడాకుల చెట్టు అంటారు. దీన్నే ఇంగ్లిష్‌లో బ్లాక్ బోర్డ్ ట్రీ అని, డెవిల్స్ ట్రీ అని కూడా పిలుస్తారు. దీని ఆకులను ఉపయోగించి బ్లాక్ బోర్డులను తయారు చేస్తారు.
ఇక సప్తపర్ణి చెట్టు ద్వారా మనకు ఆయుర్వేద పరంగా ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. ఈ చెట్ల ఆకులు, కాండం, పువ్వులు మనకు పలు విధాలుగా ఉపయోగపడతాయి. ఈ చెట్ల ఆకులు 4 నుంచి 6 ఇంచుల వరకు పొడవుగా ఉంటాయి. అలాగే 1 నుంచి 2 సెంటీమీటర్ల వరకు వ్యాసాన్ని కలిగి ఉంటాయి. ఈ చెట్టు కొమ్మలను ఉపయోగించి దంతాలను శుభ్రం చేసుకోవచ్చు. వీటిల్లో యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉంటాయి. అందువల్ల నోట్లో ఉండే బాక్టీరియా, క్రిములు నశిస్తాయి. దంతాలు, చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. నోటి దుర్వాసన తగ్గుతుంది.
ఈ చెట్టు ఆకులను అనేక రకాల చర్మ వ్యాధులను తగ్గించేందుకు ఉపయోగిస్తారు. ముఖ్యంగా దద్దుర్లు, గజ్జి, తామర వంటి చర్మ వ్యాధులకు ఈ ఆకులను ఔషధంగా వాడుతారు. దీంతో ఆయా సమస్యల నుంచి సత్వరమే ఉపశమనం లభిస్తుంది. అలాగే ఈ చెట్టు ఆకులను వాడితే పొట్టలో ఉండే పురుగులు నశిస్తాయి. జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. ఆకలి సరిగ్గా అవుతుంది. ఆకలి లేని వారు, అజీర్తి సమస్య ఉన్నవారు వాడితే చక్కని ప్రయోజనం లభిస్తుంది. మహిళలు ప్రసవం అనంతరం వీటిని తీసుకుంటే అన్ని రకాల నొప్పులు తగ్గుతాయి.
జ్వరాన్ని తగ్గించేందుకు సప్తపర్ణి కషాయాన్ని ఉపయోగిస్తారు. బాలింతల్లో పాల ఉత్పత్తిని ఈ ఆకులు పెంచుతాయి. ఈ ఆకులను పేస్ట్‌లా చేసి నొప్పులు ఉన్న చోట రాస్తే నొప్పులు, వాపులు తగ్గుతాయి. ముఖ్యంగా ఆర్థరైటిస్ వంటి సమస్యలు ఉన్నవారికి ఎంతగానో ఉపశమనం లభిస్తుంది. అలాగే ఈ ఆకులు రక్తాన్ని శుద్ధి చేయడంలోనూ పనిచేస్తాయి. గుండెకు ఎంతగానో మేలు చేస్తాయి. ఇవి మూర్ఛ రోగాన్ని కూడా తగ్గించగలవు. అలాగే పొట్టలో ఉండే అల్సర్లు, క్యాన్సర్ కణాలు నశిస్తాయి. డయాబెటిస్ ఉన్నవారికి కూడా ఈ ఆకులు ఎంతో మేలు చేస్తాయి. ఆస్తమాను కూడా తగ్గించగలవు. ఇలా సప్తపర్ణి చెట్టుతో మనం అనేక లాభాలను పొందవచ్చు.
ఈ చెట్టు బెరడు పొడి మనకు బయట మార్కెట్‌లో లభిస్తుంది. దీన్ని రోజూ మూడు నుంచి ఆరు గ్రాముల మోతాదులో తీసుకోవచ్చు. దీంతో కషాయం చేసి రోజూ 40 నుంచి 50 ఎంఎల్ మోతాదులో తాగవచ్చు. ఈ చెట్టు బెరడు, జిగురు, ఆకులు, పువ్వులు మనకు ఉపయోగపడతాయి. వీటితో భిన్న రకాల ప్రయోజనాలను పొందవచ్చు. ఈ చెట్టు భాగాలను ఎలా పడితే అలా వాడరాదు. డాక్టర్ల పర్యవేక్షణలో వాడితే ఎంతో లాభం పొందవచ్చు.