Karam Palli Snacks : పల్లీలు.. ఇవి మనందరికి తెలిసినవే. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పల్లీలను తీసుకోవడం వల్ల మనం అనేక పోషకాలను, ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. వీటిని నానబెట్టి, ఉడికించి తీసుకోవడంతో పాటు వంటల్లో కూడా విరివిరిగా వాడుతూ ఉంటాము. అలాగే అనేక రకాల చిరుతిళ్లను, చట్నీలను తయారు చేస్తూ ఉంటాము. ఇక పల్లీలతో చేసుకోదగిన రుచికరమైన చిరుతిళ్లల్లో కారం పల్లీలు కూడా ఒకటి. స్నాక్స్ గా తినడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. వీటిని 10 నిమిషాల్లో అప్పటికప్పుడు తయారు చేసి తీసుకోవచ్చు. వీటిని తయారు చేయడం కూడా చాలా తేలిక. ఎంతో రుచిగా ఉండే ఈ కారం పల్లీలను అందరూ ఇష్టపడతారని చెప్పవచ్చు. స్నాక్స్ గా తీసుకోవడానికి ఎంతో చక్కగా ఉండే ఈ కారం పల్లీలను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కారం పల్లి తయారీకి కావల్సిన పదార్థాలు..
పల్లీలు – ఒక కప్పు, నూనె – ఒక టేబుల్ స్పూన్, దంచిన వెల్లుల్లి రెమ్మలు – 4, కరివేపాకు – 2 రెమ్మలు, ఎండుమిర్చి – 2, ఉప్పు – తగినంత, పసుపు – చిటికెడు, కారం – పావు టీ స్పూన్.
కారం పల్లి తయారీ విధానం..
ముందుగా కళాయిలో పల్లీలు వేసి మాడిపోకుండా దోరగా వేయించాలి. తరువాత వీటిని ప్లేట్ లోకి తీసుకుని వాటిపై ఉండే పొట్టును తీసి వేయాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక పల్లీలు వేసి 2 నిమిషాల పాటు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో వెల్లుల్లి రెమ్మలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి వేయించాలి. తాళింపు వేగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఒక గిన్నెలో పల్లీలు తీసుకోవాలి. ఇందులో ఉప్పు, కారం, పసుపు వేసి కలపాలి. తరువాత సిద్దం చేసుకున్న తాళింపు వేసి కలిపి సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కారం పల్లీలు తయారవుతాయి. వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. పల్లీలతో తరుచూ చేసే చిరుతిళ్లతో పాటు ఇలా కారం పల్లీలను కూడా తయారు చేసి తీసుకోవచ్చు.