Kichdi Katta : మనం వంటింట్లో అప్పుడప్పుడూ దాల్ కిచిడీని తయారు చేస్తూ ఉంటాం. దాల్ కిచిడీ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. ఈ కిచిడీని కట్టాతో తింటే మరింత రుచిగా ఉంటుంది. కట్టాను తయారు చేయడం కూడా చాలా సులభం. హైదరబాదీ స్పెషల్ అయిన ఈ కిచిడీ కట్టాను తయారు చేయడం కూడా చాలా సులభం. కిచిడీని అలాగే కట్టాను హైదరాబాద్ స్టైల్ లో సులభంగా ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కిచిడీ తయారీకి కావల్సిన పదార్థాలు..
బియ్యం – ఒకటిన్నర కప్పు, ఎర్ర కందిపప్పు – అర కప్పు, నూనె – 3 టేబుల్ స్పూన్స్, దాల్చిన చెక్క – 2 ఇంచుల ముక్క, లవంగాలు – 6, దంచిన యాలకులు – 3, సాజీరా – అర టీ స్పూన్, తరిగిన పచ్చిమిర్చి – 2, పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ – 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒకటిన్నర టేబుల్ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, తరిగిన పుదీనా – కొద్దిగా, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, వేడి నీళ్లు – 4 కప్పులు.
కట్టా తయారీకి కావల్సిన పదార్థాలు..
చిక్కటి చింతపండు గుజ్జు – ఒక కప్పు, నువ్వలు – అర కప్పు, పల్లీలు – అర కప్పు, పుదీనా ఆకులు – 15, తరిగిన కొత్తిమీర – ఒక చిన్న కట్ట, పచ్చిమిర్చి – 6, ఉప్పు – తగినంత, నీళ్లు – ఒక లీటర్, పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ – 1, కరివేపాకు – ఒక రెమ్మ, నూనె – 3 టేబుల్ స్పూన్స్, ఆవాలు – ఒక టీ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, ఎండుమిర్చి – 2, తరిగిన పచ్చిమిర్చి – 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్.
కిచిడీ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో బియ్యం, ఎర్రపప్పు వేసి శుభ్రంగా కడగాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి గంట పాటు నానబెట్టాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, సాజీరా వేసి వేయించాలి. తరువాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. తరువాత నానబెట్టుకున్న బియ్యం, పసుపు, ఉప్పు, పుదీనా, కొత్తిమీర వేసి కలపాలి. బియ్యంలో ఉండే నీరంతా పోయే వరకు వేయించిన తరువాత నీళ్లు పోసి కలపాలి. దీనిపై మూత పెట్టి మధ్యస్థ మంటపై 15 నిమిషాల పాటు ఉడికించాలి.
తరువాత అన్నంపై అరటి ఆకులు లేదా విస్తరాకులు లేదా టిష్యూ పేపర్స్ ఉంచివాటిపై కొద్దిగా నీటిని చల్లాలి. తరువాత దానిపై మూతను ఉంచి చిన్న మంటపై 8 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత దీనిని 15 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తరువాత సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కిచిడీ తయారవుతుంది. ఇప్పుడు కట్టా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా కళాయిలో నువ్వులు వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత పల్లీలు వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు జార్ లో వేయించిన పల్లీలు, నువ్వులు, చింతపండు రసం, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి.
తరువాత మరో గిన్నె ఉల్లిపాయ, కరివేపాకు, ఉప్పు వేసి చేత్తో బాగా నలపాలి. తరువాత మిక్సీ పట్టుకున్న మిశ్రమం, నీళ్లు పోసి కలపాలి. ఇప్పుడు కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. తరువాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. తరువాత కరివేపాకు వేసి వేయించాలి. ఇలా తయారు చేసుకున్న తాళింపును కట్టాలో వేసి కలపాలి. ఇలా చేయడం వల్ల కట్టా తయారవుతుంది. ఈ విధంగా కిచిడీని, కట్టా తయారు చేసుకుని వీటిని కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. అల్పాహారంగా, లంచ్ గా, డిన్నర్ గా ఎలా అయినా దీనిని తినవచ్చు. ఈ కిచిడీని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.