Kobbari Undalu : మనం పచ్చి కొబ్బరిని కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. పచ్చి కొబ్బరిలో కూడా మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. పచ్చికొబ్బరిని నేరుగా తినడానికి బదులుగా దీనిని బెల్లంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇలా పచ్చి కొబ్బరిని బెల్లాన్ని కలిపి తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. రక్తం శుద్ధి అవుతుంది. అంతేకాకుండా బెల్లాన్ని, పచ్చికొబ్బరిని కలిపి ఉండలుగా తయారు చేసుకుని కూడా తింటారు. బెల్లం, కొబ్బరిని కలిపి చేసే ఈ ఉండలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. వంటరాని వారు కూడా చేసుకునేంత సులభంగా రుచిగా కొబ్బరి ఉండలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కొబ్బరి ఉండల తయారీకి కావల్సిన పదార్థాలు..
కొబ్బరి కాయ – 1 ( పెద్దది), బెల్లం తురుము – 400 గ్రా., నీళ్లు – 3 టేబుల్ స్పూన్స్, యాలకుల పొడి – ఒక టీ స్పూన్, నెయ్యి – 2 టీ స్పూన్స్.
కొబ్బరి ఉండల తయారీ విధానం..
ముందుగా కొబ్బరిని తురుము కోవాలి. తరువాత ఈ తురుమును చేత్తో పిండుతూ పాలను వేరు చేయాలి. ఇలా పాలను పిండగా మిగిలిన తురుముకు రెట్టింపు పరిమాణంలో బెల్లం తురుమును తీసుకోవాలి. ఈ బెల్లం తురుమును ఒక కళాయిలో వేసి అందులో నీళ్లు పోసి వేడి చేయాలి. బెల్లం కరిగి తీగ పాకం వచ్చే వరకు దీనిని వేడి చేయాలి. తీగ పాకం వచ్చిన తరువాత కొబ్బరి తురుమును వేసి కలపాలి. దీనిని దగ్గర పడే వరకు కలుపుతూ ఉడికించాలి. ఇలా ఉడికించిన తరువాత కొద్దిగా కొబ్బరి మిశ్రమాన్ని తీసుకుని ఉండగా చుట్టి చూడాలి. ఇలా ఉండగా చుట్టడానికి వస్తే కొబ్బరి మివ్రమం తయారయ్యిందిగా భావించాలి. ఒకవేళ ఉండగా చుట్టడానికి రాకపోతే మరికొద్ది సేపు ఉడికించాలి.
ఇలా ఉడికించిన తరువాత యాలకుల పొడి, నెయ్యి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ మిశ్రమం గోరు వెచ్చగా అయిన తరువాత చేతికి నెయ్యికి రాసుకుంటూ తగిన మోతాదులో కొబ్బరి మిశ్రమాన్ని తీసుకుని ఉండలుగా చుట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కొబ్బరి ఉండలు తయారవుతాయి. వీటిని గాలి తగలకుండా నిల్వ చేసుకోవడం వల్ల కొబ్బరి ఉండలు తయారవుతాయి. బయట దొరికే చిరుతిళ్లకు బదులుగా ఇలా కొబ్బరి ఉండలను తయారు చేసుకుని స్నాక్స్ గా తినవచ్చు. వీటిని తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. రోజుకు ఒకటి లేదా రెండు కొబ్బరి ఉండలను తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది.