Kothimeera Tomato Rice : మనం వివిధ రకాల రైస్ వెరైటీలను కూడా తయారు చేస్తూ ఉంటాము. రైస్ వెరైటీలు చాలా రుచిగా ఉండడంతో పాటు చాలా సులభంగా వీటిని తయారు చేసుకోవచ్చు. మనం సులభంగా తయారు చేసుకోగలిగిన రుచికరమైన రైస్ వెరైటీలల్లో కొత్తిమీర టమాట రైస్ కూడా ఒకటి. దీనిని అప్పటికప్పుడు చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇంటి అతిథులు వచ్చినప్పుడు, లంచ్ బాక్స్ లోకి దీనిని తయారు చేసి తీసుకోవచ్చు. రుచిగా, కమ్మగా ఉండే ఈ కొత్తిమీర టమాట రైస్ ను సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కొత్తిమీర టమాట రైస్ తయారీకి కావల్సిన పదార్థాలు..
బాస్మతీ బియ్యం – ఒకటిన్నర గ్లాసులు, నూనె – 2 టేబుల్ స్పూన్స్, దాల్చిన చెక్క – 2 ఇంచుల ముక్క, లవంగాలు – 2, యాలకులు – 2, కొత్తిమీర – ఒక పెద్ద కట్ట, టమాటాలు – పెద్దవి 2, సాజీరా – ఒక టీ స్పూన్, బిర్యానీ ఆకు – 1, అనాస పువ్వు – 1, జీడిప్పు – 2 టేబుల్ స్పూన్స్, కరివేపాకు – 2 రెమ్మలు, తరిగిన పచ్చిమిర్చి – 4, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, తరిగిన ఉల్లిపాయ ముక్కలు – ముప్పావు కప్పు, సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు – అర కప్పు, పచ్చి బఠాణీ – పావు కప్పు, ఉప్పు – తగినంత, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, నెయ్యి -ఒక టీ స్పూన్.
కొత్తిమీర టమాట రైస్ తయారీ విధానం..
ముందుగా బియ్యాన్ని శుభ్రంగాకడిగి తగినన్ని నీళ్లు పోసి అన్నాన్ని వండుకోవాలి. తరువాత ఈ అన్నాన్ని పొడి పొడిగా చేసుకుని పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వేసి వేయించాలి. తరువాత కొత్తిమీరను కాడలతో సహా వేసుకోవాలి. తరువాత టమాట ముక్కలు వేసి కలపాలి.వీటిపై మూత పెట్టి టమాట ముక్కలు మెత్తగా అయ్యే వరకు మగ్గించాలి. టమాట ముక్కలు మగ్గిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లారినవ్వాలి. తరువాత వీటిని జార్ లో వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు కళాయిలో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. తరువాత కొద్దిగా దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, సాజీరా, అనాసపువ్వు, బిర్యానీ ఆకు వేసి వేయించాలి. తరువాత జీడిపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి.
ఇవి వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డెన్ కలర్ లోకి వచ్చే వరకు వేయించాలి. తరువాత క్యారెట్ ముక్కలు, పచ్చి బఠాణీ వేసి వేయించాలి.ఇవి వేగిన తరువాత ఉప్పు, ధనియాల పొడి వేసి కలపాలి. తరువాత మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసి నూనె పైకి తేలే వరకు వేయించాలి. తరువాత అన్నం వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి. చివరగా నెయ్యి వేసి కలుపుకోవాలి. తరువాత పైన కొత్తిమీరను చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కొత్తిమీర టమాట రైస్ తయారవుతుంది. దీనిని రైతాతో తింటే చాలా రుచిగా ఉంటుంది. అలాగే దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.