Kura Karam : కూర‌ల రుచిని మార్చేసే కూర కారం.. త‌యారీ ఇలా.. కూర‌ల్లో వేస్తే రుచి అదిరిపోతుంది..

Kura Karam : కూర కారం.. చాలా మంది ఈ కారాన్ని కూడా సంవ‌త్స‌రానికి స‌రిప‌డా త‌యారు చేసుకుని నిల్వ చేసుకుంటారు. వేపుడు కూర‌ల్లో, ఇత‌ర వంట‌కాల్లో, అల్పాహారాల్లోకి ఈ కారాన్ని వాడుతుంటారు. ఈ కూర కారాన్ని వేయ‌డం వ‌ల్ల వంట‌ల రుచి మ‌రింత పెరుగుతుంది. ఈ కారాన్ని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. కూర కారాన్ని సుల‌భంగా ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

కూర కారం త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు…

ధ‌నియాలు – ముప్పావు క‌ప్పు, జీల‌క‌ర్ర – ఒక టేబుల్ స్పూన్, ఆవాలు – ఒక టేబుల్ స్పూన్, ప‌ల్లీలు – 2 టేబుల్ స్పూన్స్, శ‌న‌గ‌ప‌ప్పు – ఒక టేబుల్ స్పూన్, మిన‌ప‌ప్పు – ఒక టేబుల్ స్పూన్, నువ్వులు – 2 టేబుల్ స్పూన్స్, చింత‌పండు – 5 గ్రా., నూనె – ఒక టీ స్పూన్, ఎండుమిర్చి – 125 గ్రా., ఉప్పు – 2 టీ స్పూన్స్, వెల్లుల్లి రెబ్బ‌లు – 20, ప‌సుపు – ఒక టీ స్పూన్.

Kura Karam very tasty with curries make in this method
Kura Karam

కూర కారం త‌యారీ విధానం..

ముందుగా ఒక క‌ళాయిలో ధ‌నియాలు వేసి చిన్న మంట‌పై వేయించాలి. త‌రువాత జీల‌క‌ర్ర‌, ఆవాలు,ప‌ల్లీలు, శ‌న‌గ‌ప‌ప్పు, మిన‌ప‌ప్పు వేసి వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన త‌రువాత నువ్వులు వేసి వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత ఇందులోనే చింత‌పండును వేసి ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత అదే క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ఎండుమిర్చి వేసి వేయించాలి. ఇవి వేగిన త‌రువాత జార్ లోకి తీసుకుని మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత ఇందులో ముందుగా వేయించిన ప‌దార్థాల‌తో పాటు ఉప్పు, వెల్లుల్లి రెబ్బ‌లు కూడా వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత ఇందులో ప‌సుపు వేసి క‌లిపి ఒక గాజు సీసాలోకి లేదా ప్లాస్టిక్ డ‌బ్బాలోకి తీసుకుని గాలి త‌గ‌ల‌కుండా నిల్వ చేసుకోవాలి.

ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే కూర కారం త‌యారవుతుంది. గాలి, త‌డి త‌గ‌ల‌కుండా నిల్వ చేసుకోవ‌డం వ‌ల్ల ఈ కారం 6 నుండి 7 నెల‌ల పాటు తాజాగా ఉంటుంది. ఫ్రిజ్ లో ఉంచి నిల్వ చేసుకోవ‌డం వ‌ల్ల మ‌రికొంత కాలం తాజాగా ఉంటుంది. ఈ కారాన్ని ఇడ్లీ, దోశ వంటి వాటితో పాటు క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. అలాగే వెజ్, నాన్ వెజ్ వేపుడు కూర‌ల్లో ఈ కారాన్ని వేసుకుంటే మ‌నం చేసే వంట‌కాల రుచి మ‌రింత పెరుగుతుంది.

Share
D

Recent Posts