Lapsi : మనం గోధుమ రవ్వతో రకరకాల తీపి వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. గోధుమ రవ్వతో చేసుకోదగిన తీపి వంటకాల్లో లాప్సి కూడా ఒకటి. దీనిని మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశం, గుజరాత్ వంటి రాష్రాల్లో ఎక్కువగా తయారు చేస్తూ ఉంటారు. దీనిని దేవుడికి నైవేధ్యంగా కూడా సమర్పించవచ్చు. కమ్మటి రుచిని కలిగి ఉండే ఈ లాప్సీని ఎలా తయారు చేసుకోవాలి… తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి… అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
లాప్సి తయారీకి కావల్సిన పదార్థాలు..
ఎర్ర గోధుమ రవ్వ – ఒక కప్పు, పెసరపప్పు – 2 టేబుల్ స్పూన్స్, బెల్లం తురుము – ఒక కప్పు, నీళ్లు – 3 కప్పులు, నెయ్యి – ఒక కప్పు, యాలకుల పొడి – ఒక టీ స్పూన్, జీడిపప్పు – 2 టేబుల్ స్పూన్స్, దాల్చిన చెక్క – రెండు ఇంచుల ముక్క, లవంగాలు – 3,ఎండు ద్రాక్ష – 2 టేబుల్ స్పూన్స్.
లాప్సి తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి వేడి చేయాలి. నెయ్యి వేడయ్యాక దాల్చిన చెక్క, లవంగాలు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత గోధుమ రవ్వను వేసి చిన్న మంటపై దోరగా వేయించుకుని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో పెసరపప్పు వేసి వేయించుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో బెల్లం తురుము, ఒక కప్పు నీళ్లు పోసి వేడి చేయాలి. బెల్లం కరిగిన తరువాత దీనిని మరో 3 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పడు కళాయిలో నీళ్లు పోసి వేడి చేయాలి. నీళ్లు వేడయ్యాక వేయించిన గోధుమ రవ్వ, పెసరపప్పు వేసి మెత్తగా ఉడికించాలి. గోధుమ రవ్వ ఉడికిన తరువాత అందులో బెల్లం పాకాన్ని వడకట్టి వేసుకోవాలి.
తరువాత ఇందులో అర కప్పు నెయ్యిని వేసి దగ్గర పడే వరకు కలుపుతూ ఉడికించాలి. ఇది ఉడుకుతుండగానే ఒక కళాయిలో మిగిలిన నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడయ్యాక జీడిపప్పు, ఎండుద్రాక్ష వేసి వేయించాలి. తరువాత వీటిని ఉడుకుతున్న గోధుమ రవ్వ మిశ్రమంలో వేసి కలపాలి. దీనిని దగ్గర పడే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే లాప్సి తయారవుతుంది. దీని తయారీలో పాలను, కొబ్బరి పాలను, చక్కెరను కూడా ఉపయోగించుకోవచ్చు. తీపి తినాలనిపించినప్పుడు, పండుగలకు ఇలా లాప్సిని తయారు చేసుకుని తినవచ్చు.