Laughing Budha : లాఫింగ్ బుద్ధా గురించి మీకు తెలుసు కదా..! అదేనండీ.. పెద్ద పొట్టతో చేతిలో నాణేలు లేదా ఇతర వస్తువులతో నిండిన సంచితో ఎల్లప్పుడూ నవ్వుతూ దర్శనమిస్తాడు. అతని బొమ్మను చాలా మంది గిఫ్ట్ రూపంలో పొందేందుకు ఇష్ట పడతారు. ఎందుకంటే లాఫింగ్ బుద్ధా ఇంట్లో ఉంటే దాని వల్ల ఐశ్వర్యం సిద్ధిస్తుందని, సంపద బాగా కలసి వస్తుందని కొందరి నమ్మకం. అయితే మీకు తెలుసా..? లాఫింగ్ బుద్ధా బొమ్మలు అన్నీ ఒకే రకంగా ఉండవు. కొన్ని నిలబడినట్టుగా ఉంటే, కొన్ని కూర్చున్నట్టుగా ఉంటాయి. ఇంకొన్ని పడుకున్నట్టుగా కూడా ఉంటాయి. ఈ క్రమంలో ఏ బొమ్మను పెట్టుకుంటే ఎలాంటి ఫలితం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
లాఫింగ్ బుద్ధా విగ్రహం చేతిలో బౌల్ (పాత్ర)తో ఉంటే అలాంటి బొమ్మ వల్ల జీవితం సుఖవంతంగా ఉంటుందట. అలాంటి వారి కుటుంబాల్లో సంతోషాలు, ఉత్సాహం వెల్లివిరుస్తాయట. చుట్టూ 5 మంది పిల్లలు ఉన్నట్టుగా ఉండే లాఫింగ్ బుద్ధా బొమ్మ వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. అందరిలోకి పాజిటివ్ శక్తి ప్రవేశిస్తుంది. దీంతో అనుకున్నవి నెరవేరుతాయి. చేతిలో విసనకర్రతో లాఫింగ్ బుద్ధా కూర్చుని ఉంటే దాని వల్ల ఆ వ్యక్తుల జీవితాల్లో ఉండే సమస్యలన్నీ ఇట్టే తొలగిపోతాయట. జీవితమంతా సుఖమయం అవుతుందట. పెద్ద సంచిలో నాణేలతో లాఫింగ్ బుద్ధా విగ్రహం ఉంటే దాంతో అంతులేని సంపద, ఐశ్వర్యం కలగుతుందట. ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయట.
చేతిలో రుద్రాక్ష వంటి మాలతో లాఫింగ్ బుద్దా ఉంటే దాని వల్ల అమితమైన తెలివితేటలు కలుగుతాయట. మిక్కిలి జ్ఞానవంతులుగా మారుతారట. లాఫింగ్ బుద్దా విగ్రహం కూర్చుని ఉన్న భంగిమలో ఉంటే వ్యక్తుల మధ్య అన్యోన్యమైన సంబంధాలు ఉంటాయట. ప్రేమగా ఉంటారట. లాఫింగ్ బుద్దా విగ్రహం నిలుచుని ఉంటే సంపద అలాగే నడిచి వస్తుందట. ధనం బాగా సంపాదిస్తారట. చేతిలో విసనకర్ర, సొరకాయ ఉన్న లాఫింగ్ బుద్ధా ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో ఉన్న వారికి ఆరోగ్య సమస్యలు రావట. ఆరోగ్యంగా ఉంటారట. ఇలా భిన్న రకాల్లో ఉండే లాఫింగ్ బుద్ధా విగ్రహాల వల్ల భిన్న రకాల ఫలితాలను పొందవచ్చని ఫెంగ్ షుయ్ వాస్తు చెబుతోంది.