Left Over Rice Rasgulla : మనలో చాలా మంది ఇష్టంగా తినే తీపి పదార్థాల్లో రసగుల్లా కూడా ఒకటి. రసగుల్లా నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత రుచిగా, మృదువుగా ఉంటుంది. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. సాధారణంగా రసగుల్లాను మనం పాలతో తయారు చేస్తూ ఉంటాము. అయితే పాలతోనే కాకుండా ఈ రసగుల్లాలను మనం మిగిలిన అన్నంతో కూడా తయారు చేసుకోవచ్చు. అన్నంతో చేసే ఈ రసగుల్లాలు కూడా చాలా రుచిగా, మృదువుగా ఉంటాయి. వీటిని తయారు చేయడం కూడా చాలా తేలిక. అన్నంతో రుచిగా రసగుల్లాలను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రైస్ రసగుల్లా తయారీకి కావల్సిన పదార్థాలు..
అన్నం – ఒక కప్పు, మైదాపిండి – ఒక టేబుల్ స్పూన్, పాల పొడి – ఒక టేబుల్ స్పూన్, కార్న్ ఫ్లోర్ – ఒక టేబుల్ స్పూన్, పంచదార – ఒక కప్పు, నీళ్లు – రెండు కప్పులు, యాలకుల పొడి – చిటికెడు.
రైస్ రసగుల్లా తయారీ విధానం..
ముందుగా ఒక జార్ లో అన్నం వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఒక ప్లేట్ కు నెయ్యి రాసుకుని అందులో ఈ పేస్ట్ ను వేసుకోవాలి. తరువాత ఇందులో మైదాపిండి, పాలపొడి, కార్న్ ఫ్లోర్ ను వేసుకోవాలి. తరువాత చేతులకు నెయ్యి రాసుకుంటూ అంతా కలిసేలా కలుపుకోవాలి. దీనిని ఉండలా కలుపుకున్న తరువాత చిన్న చిన్న రసగుల్లాలుగా చేసుకుని పక్కకు ఉంచాలి. ఇప్పుడు కళాయిలో పంచదార, నీళ్లు పోసి వేడి చేయాలి. పంచదార కరిగిన తరువాత యాలకుల పొడి వేసి కలపాలి.
తరువాత రసగుల్లాలను ఈ నీటిలో వేసి మూత పెట్టి 15 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవి కొద్దిగా చల్లారిన తరువాత గిన్నెలో వేసుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే రైస్ రసగుల్లాలు తయారవుతాయి. వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. తీపి తినాలనిపించినప్పుడు అలాగే అన్నం మిగిలినప్పుడు ఇలా రసగుల్లాలను తయారు చేసుకుని తినవచ్చు.